- రాజకీయ అండతో రెచ్చిపోయిన యాజమాన్యాలు
- విచారణలో వెల్లడైన అక్రమాలు
- ఏడు రైస్ మిల్లులకు రూ.8 కోట్లకుపైగా జరిమానా
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల సిండికేట్ ఘరానా మోసానికి పాల్పడింది. సీఎంఆర్ బియ్యం చెల్లింపుల్లో కొన్ని రైస్ మిల్లుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అక్రమాలకు పాల్పడిన ఏడు రైస్ మిల్లులకు పౌరసరఫరాల శాఖ అధికారులు రూ.8 కోట్ల 27 లక్షల జరిమానా విధించింది. అయితే సంబంధిత అధికారులు కేవలం జరిమానాకే పరిమితం కావడం అనుమానాలకు తావిస్తోంది. క్రిమినల్ చర్యలకు ఎందుకు సిఫారసు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవ్వకుండా మొండికేసిన ఏడు మిల్లులు
2021–22 యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి కొన్ని ధాన్యాన్ని జిల్లాలోని 32 రైస్ మిల్లులకు 98 వేల 776.640 మెట్రిక్ టన్నులను సీఎంఆర్ కోసం అందించారు. రైస్ మిల్లు యాజమాన్యాలు ఆ ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించాలి. కానీ సదరు రైస్ మిల్లు యాజమాన్యాలు బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదు. సివిల్ సప్ల్యైస్ అధికారులు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసి, గడువులు విధించగా చివరకు 25 రైస్ మిల్లులు తమకు కేటాయించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి చెల్లించాయి. అయితే మిగతా ఏడు మిల్లులు మాత్రం బియ్యాన్ని ఇవ్వకుండా మొండికేశాయి. ఈ ఏడు రైస్‌మిల్లుల యాజమానులకు ముధోల్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అండదండ ఉండడంతో అధికారుల హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. 10వేల 599 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇవ్వలేదు. పలు హెచ్చరికలు, గడువుల అనంతరం అధికారులు ఆ ఏడు మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. వాటికి రూ.8 కోట్ల 27 లక్షల జరిమానా విధించారు. అయితే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
ALSO READ :ఇంకా ముసురే.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వాన
జరిమానా సరే.. చర్యలేవి?
ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని పలు రైస్ మిల్లుల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు భాగ
స్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాటి యజమానుకుల రాజకీయ అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. దీనికితోడు బైంసా ప్రాంతానికి చెందిన ఓ రైసుమిల్లు యజమాని కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని కారణంగానే అధికారులు రైస్ మిల్లుల అక్రమాలపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నెలల తరబడి సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా మిల్లుల్లో అక్రమాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం
నిబంధనలు అతిక్రమించి, సీఎంఆర్ బియ్యాన్ని సకాలంలో తిరిగి ఇవ్వని రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటున్నాం. బియ్యాన్ని సకాలంలో అందించని ఏడు రైస్‌మిల్లులకు రూ.8 కోట్ల 27 లక్షల జరిమానా విధించాం. సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు చేపడతాం. అవకతవకలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం.
శ్రీకళ, డిస్ట్రిక్ట్ మేనేజర్,సివిల్ సప్లైస్ కార్పొరేషన్, నిర్మల్