GG-W vs RCB-W: ఒకే మ్యాచ్‌లో 7 రనౌట్లు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

GG-W vs RCB-W: ఒకే మ్యాచ్‌లో  7 రనౌట్లు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

క్రికెట్ లో రనౌట్స్ కావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సమన్వయ లోపం కారణంగా, వేగంగా సింగిల్ తీసే క్రమంలో, స్పెషలిస్ట్  బ్యాటర్ కోసం బౌలర్ తన వికెట్ కు రనౌట్ రూపంలో త్యాగం చేయడం లాంటివి మనం చూసే ఉంటాం. ఒక మ్యాచ్ లో ఒకటి లేదా రెండు రనౌట్స్ చోటు చేసుకోవడం సహజమే. కానీ మహిళల ప్రీమియర్ లీగ్ లో ఏకంగా 7 రనౌట్స్ చోటు చేసుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ జయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జయింట్స్ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్స్ రనౌట్ రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత బెంగళూరు జట్టులో మరో మూడు రనౌట్స్ అయ్యాయి. దీంతో ఒకే మ్యాచ్ లో 7 రనౌట్స్ తో టీ20 క్రికెట్ లో అరుదైన మ్యాచ్ గా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ క్రికెట్ లో ఒక మ్యాచ్ లో 7 గురు రనౌట్స్ కావడం ఇదే తొలి సారి కావడం విశేషం. మ్యాచ్ మొత్తంలో 13 వికెట్లు పడితే అందులో ఏడుగురు రనౌట్స్ రూపంలో వెనుదిరిగారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు వోల్వర్ట్(76), మూని(85) హాఫ్ సెంచరీలు చేసి భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు 180 పరుగులకే పరిమితమైంది. వారెహం 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.