ఇక్కడ శివాలయంలో నంది నోట్లో నుంచి నీళ్లు వస్తాయి..

సిలికాన్‌వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఆశ్చర్యపరిచే మిస్టరీలు చాలా ఉన్నాయి. ఇక్కడ బయటపడిన 7 వేల సంవత్సరాల నాటి నంది తీర్ధంలో నంది నోటి నుంచి నిరంతరం నీళ్లు వస్తుంటాయి.. ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం..

 నంది తీర్ధం

 బెంగళూరు నగరంలో దాదాపు 7 వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీదక్షిణ ముఖ నంది కళ్యాణ క్షేత్రం ఉంది. ఇది  మర్మ దేవాలయాల్లో  ఒకటి. బెంగళూరు సిటీకు వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని నంది తీర్ధ, నందీశ్వర తీర్ధ, బసవ తీర్ధ లేదా మల్లేశ్వరం నంది గుడి అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మహా శివుడు శివలింగ రూపంలో పూజలందుకుంటున్నాడు.

ఈ ఆలయానికి కేంద్ర బిందువుగా నంది విగ్రహం. ఇది దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే దీనికి దక్షిణ ముఖ నంది అనే పేరు వచ్చింది. ఈ నంది నోటి నుంచి నిరంతరం జలం రావడం ఇక్కడ ప్రత్యేకత. దీన్ని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు. నంది నోటి నుంచి వచ్చిన నీరు ఆలయం మధ్యలో ఉన్న కళ్యాణి అనే మెట్ల తొట్టెలోకి వెళ్తుంది.

ఆలయం చరిత్ర:

1997లో బెంగళూరు నగరంలోని కడు మల్లేశ్వర ఆలయానికి అభిముఖంగా ఉన్న ఖాళీ స్థలంలో ఓ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే తవ్వకాలు చేస్తున్న సమయంలో కార్మికులు ఇక్కడ ఓ ఆలయం ఉన్నట్లు గుర్తించారు. ఇంకాస్త లోతుగా తవ్వగా ఈ శివాలయం బయటపడినట్లు చెబుతారు. భారత పురాతత్వ పరిశోధన శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఆలయం మధ్యలో ఉన్న కొలను, గ్రానైట్ మెట్ల నిర్మాణాలను, మండప స్తంభాలను కనుగొన్నారు. ఈ ఆలయంలో నంది విగ్రహం నోటి నుంచి నిరంతరం వచ్చే జలం ద్వారా శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతుంటుంది. ఈ ఆలయ వయస్సుపై విరుద్దమైన నివేదికలు ఉన్నాయి. ఇది 400 సంవత్సరాల క్రితం నాటిదని కొన్ని నివేదికలు చెబితే, కొన్ని ఆధారాల ప్రకారం ఇది 7000 సంవత్సరాల పూర్వందని చెబుతున్నారు.

ఈ ఆలయం స్తంభాలతో కూడిన కళ్యాణి ప్రాంగణం చుట్టూ నిర్మించబడింది. సాధారణంగా అన్ని శివలింగ క్షేత్రాల్లో శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం నంది పైన, శివలింగం కింద ఉండడం విశేషం. శివలింగానికి ఎడమ వైపు మూలన చిన్న గణేశుని విగ్రహం ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రధాన విగ్రహానికి కుడి వైపు నవగ్రహ మండపం ఉంటుంది.

ఎక్కడ ఉంది ?

 బెంగళూరు ప్రధాన నగరం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయ ప్రాచుర్యం, ప్రత్యేకతలు రోజురోజుకూ విస్తరించడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.   ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ప్రజలు నివసించారనడానికి, ఈ ఆలయం ప్రజల నుంచి పూజలు అందుకుందని చెప్పడానికి ఆలయంలో ఉన్న కళ్యాణి ప్రదేశం ఒక జ్ఞాపకంగా, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. కాలక్రమంలో బెంగళూరు నగరంలో మల్లేశ్వరం ప్రాంతం నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ప్రముఖమైనదిగా అభివృద్ధి చెందింది.