చిట్టి తల్లికి.. పెద్ద జబ్బు..బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఏడేండ్ల బాలిక కృతిక

చిట్టి తల్లికి.. పెద్ద జబ్బు..బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఏడేండ్ల బాలిక కృతిక
  • బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేయాలంటే రూ. 25 లక్షలు అవసరం
  • పేద కుటుంబం కావడంతో దాతల సాయం కోసం ఎదురుచూపు

 హైదరాబాద్, వెలుగు:  చిట్టి తల్లికి పెద్ద జబ్బు సోకింది. ఐదు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఇప్పటికే రూ. 10 లక్షలకు పైగా ఖర్చు అయ్యాయి. అయినా.. మాయదారి జబ్బు మరో రూ. 25లక్షలకు పైగా కోరుతోంది. పేద కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతలసాయం కోసం ఎదురుచూస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన గౌరి విజయ్ కుమార్, రాణి దంపతులకు పాప కృతిక, కొడుకు ఉన్నారు.

 విజయ్ హైదరాబాద్ లో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  మూడో తరగతి చదివే ఏడేండ్ల కృతిక గతేడాది అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రిలో చూపించగా బ్లడ్ క్యాన్సర్(ఏఎమ్ఎల్) సోకినట్టు డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే మెరుగైన చికిత్స చేయించకపోతే బిడ్డప్రాణాలు దక్కవని చెప్పారు. దీంతో పేరెంట్స్ తమ బిడ్డను బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించారు.  గత డిసెంబర్ నుంచి ఐదు నెలలుగా ట్రీట్ మెంట్ చేయిస్తుండగా, ఇప్పటివరకు రూ. 10 లక్షలు ఖర్చు చేశారు. 

అయితే పాపకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేయాలని, అందుకు రూ. 25 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు సూచించారు. వెంటనే చికిత్స చేయకుంటే బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీంతో తమ పాప ప్రాణాలను  కాపాడుకునేందుకు  పేరెంట్స్ దాతల సాయం కోరుతున్నారు.  

ఎవరైనా   స్పందించి తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. వివరాలకు గౌరి విజయ్ కుమార్ ఫోన్ 9948413146 నంబర్ లో సంప్రదించవచ్చు. డబ్బులు పంపాలనుకుంటే చిన్నారి తండ్రి ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్: 000801605543 (IFSC : ICIC0000008)కు పంపవచ్చు.