- ప్రభుత్వం తరఫున ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- పిల్లర్ల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని
- కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజీకి ప్రమాదం
- డైమండ్ కట్టింగ్‌తో పిల్లర్ల తొలగింపు
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.95 వేల కోట్లు
- ఖర్చు చేసి 97 వేల ఎకరాలకే నీళ్లు
- తెచ్చిన లోన్లకు రూ.16 వేల కోట్ల వడ్డీలు చెల్లింపు
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ను కూల్చి మళ్లీ నిర్మించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీకి బుంగలు పడటం తదితర అంశాలపై శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తరఫున ఈఎన్సీ మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘‘బ్యారేజీలోని 20వ నంబర్ పిల్లర్ ఈ ఏడాది అక్టోబర్ 21న కుంగిపోయింది. ఏడో బ్లాక్‌లోని 19 నుంచి 21వ నంబర్ వరకు పిల్లర్లు దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి నిర్మించాల్సిందే. వాటిని తొలగించడానికి బ్లాస్ట్ చేసే అవకాశం లేదు. అలా చేస్తే మిగతా పిల్లర్లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన మూడు పిల్లర్లను డైమండ్ కట్టింగ్ విధానంలో కూల్చేసి.. వాటి బాటమ్ ఫౌండేషన్‌లో ఏం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసి నిర్ధారిస్తాం. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో ఏర్పడిన గుంటలను కెమికల్ ట్రీట్‌మెంట్‌తో గ్రౌటింగ్ చేస్తాం. ఏడో బ్లాక్ వైపునకు నీళ్లు రాకుండా మట్టి కట్ట (కాఫర్‌డ్యాం) నిర్మిస్తున్నాం. బ్యారేజీ బెడ్ వద్ద నుంచి నీటి తొలగింపు పూర్తయింది. జనవరి రెండో తేదీ నుంచి బ్యారేజీ కుంగుబాటుకు కారణాలను అన్వేషించడం మొదలవుతుంది. కుంగుబాటుకు కారణాలను నిర్ధారించిన తర్వాత.. ఏజెన్సీలే రెండు నెలల్లో పనులు చేస్తాయి’’ అని తెలిపారు.
18.64 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని టార్గెట్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.95 వేల కోట్లు ఖర్చు చేశామని, దీనికింద 97వేలకు పైగా ఎకరాలకు నీళ్లిచ్చామని ప్రజెంటేషన్ సందర్భంగా ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. లోయర్ మానేరు డ్యాం కింద ఎస్సారెస్పీ స్టేజీ –1, స్టేజీ –2, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద రెండు సీజన్లలో కలిపి 17,08,230 ఎకరాలను స్థిరీకరించామని తెలిపారు. 2020 – 21 యాసంగి సీజన్ నుంచి 2023 – 24 వానాకాలం సీజన్ వరకు కూడెల్లివాగు, హల్దీవాగు, 66 చెక్ డ్యామ్‌ల కింద ఉన్న 20,576 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నీళ్లతో 456 చెరువులు నింపామని, తద్వారా వాటి కింద ఉన్న 39,146 ఎకరాలకు నీళ్లిచ్చామని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీటితో ఎస్సారెస్పీ స్టేజీ –1, స్టేజీ –2, నిజాంసాగర్ ప్రాజెక్టు కాల్వల కింద ఉన్న 2,143 చెరువులు నింపామని, తద్వారా వాటి కింద ఉన్న 1,67,050 ఎకరాలు స్టెబిలైజ్చేశామని తెలిపారు. రాబోయే వాటర్ ఇయర్2024 –25 నుంచి 2028 – 29 వరకు ప్రాజెక్టు కింద మిగిలిన 18,64,790 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు.
‘ప్రాణహిత-చేవెళ్ల’ కోసం అప్పట్లోనే రూ.11,679 కోట్ల ఖర్చు
ఉమ్మడి ఏపీలో తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కోసం 2016 నాటికి (కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్‌చేసే వరకు) రూ.11,679.71 కోట్లు ఖర్చు చేశామని ఈఎన్సీ తెలిపారు. ‘‘ప్రాణహిత నది నుంచి 160 టీఎంసీలను ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలించి 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.17,875 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇస్తూ 2007 మే 16న జీవో 124 జారీ చేశారు. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు అంచనాలను రూ.38,500 కోట్లకు పెంచుతూ 2008 డిసెంబర్ 17న జీవో 238 జారీ చేశారు. తద్వారా పాత అంచనాలను సవరిస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు. ప్రాణహిత ద్వారా నీళ్లు ఎత్తిపోయడానికి 3,466 మెగావాట్ల (అంటే ఏటా 8,701 మిలియన్ యూనిట్లు) కరెంట్ అవసరమని అంచనా వేశారు. రీ ఇంజనీరింగ్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మధ్యంతరంగా వదిలేసింది. ప్రాణహిత – చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో 5.09 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ ప్రతిపాదించగా.. మహారాష్ట్ర పరిధిలో 3,786 ఎకరాల ముంపు ఉండడంతో ఆ రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. దీంతో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా నీటి లభ్యత 165.38 టీఎంసీలు మాత్రమే. నీటి నిల్వల కోసం ప్రత్యామ్నాయాలను చూడాలని సీడబ్ల్యూసీ సూచించింది. దీంతో వ్యాప్కోస్ ద్వారా స్టడీ చేసి మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల లభ్యత ఉందని తేలడంతో ప్రాజెక్టును అక్కడికి మార్చాం” అని వివరించారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ నుంచి ఐదేండ్లలో 162.32 టీఎంసీలు ఎత్తిపోసినట్లు ఈఎన్సీ తెలిపారు.
కాళేశ్వరం పెండింగ్ బిల్లులు రూ.3,192 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్ బిల్లులు రూ.3,192.08 కోట్లు ఉన్నాయని ఈఎన్సీ వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం చేసిన బిల్లుల్లో రూ.1,915.88 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా, రూ.576.57 కోట్లు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సి ఉందని తెలిపారు. భూసేకరణ బిల్లులు రూ.466.58 కోట్లు, పునరావాసం కోసం రూ.229.15 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. సబ్ స్టేషన్లకు రూ.2.43 కోట్లు, కేపీఎంజీ కన్సల్టెన్సీకి రూ.1.18 కోట్లు, ఎన్పీడీసీఎల్ కు రూ.25 లక్షల బిల్లు బకాయి ఉందన్నారు.
కాళేశ్వరం అప్పు రూ.87,449 కోట్లు
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం (అడిషనల్ టీఎంసీని కలుపుకొని) యూనియన్ బ్యాంక్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల ద్వారా రూ.87,449.16 కోట్ల లోన్లు శాంక్షన్ అయ్యాయి. అందులో రూ.71,565.69 కోట్లు తీసుకున్నారు. ఇంకా ఆర్థిక సంస్థల నుంచి రూ.15,698.91 కోట్లు విడుదల కావాల్సి ఉంది. తీసుకున్న లోన్ల నుంచి ఇప్పటి వరకు రూ.4,696.33 కోట్ల అసలు రీ పేమెంట్ చేశారు. గడిచిన ఐదేండ్లలో తెచ్చిన అప్పులకు వడ్డీ రూపంలో రూ.16,201.94 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. మొత్తం కలిపితే రూ.21,157.87 కోట్లు తిరిగి చెల్లించారు. కాళేశ్వరం కార్పొరేషన్‌లో భాగమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల లోన్ శాంక్షన్ కాగా.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.7,721.51 కోట్లు రిలీజ్చేసింది. ఇంకో రూ.2,278.49 కోట్లు రిలీజ్ కావాల్సి ఉంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు గడిచిన మూడేళ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించారు. ఈ అప్పులకు సంబంధించి అసలు చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు” అని ఈఎన్సీ మురళీధర్ వివరించారు.