ఏడో తరగతి స్టూడెంట్​ సూసైడ్​

ఏడో తరగతి స్టూడెంట్​ సూసైడ్​
  • యాజమాన్యం, టీచర్స్ వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపణ

ఎల్బీనగర్,వెలుగు: హయత్​నగర్ లోని ఓ కార్పొరేట్ ​రెసిడెన్షియల్​ స్కూల్​లో ఏడో తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్​ హాస్టల్ ​రూమ్​లో సోమవారం రాత్రి ఉరి వేసుకుని సూసైడ్​ చేసుకున్నాడు. స్కూల్ మేనేజ్​మెంట్, ​టీచర్లు, సిబ్బంది వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పోలీసులు, మృతుడి తండ్రి కథనం ప్రకారం..వనపర్తి జిల్లా రెవల్లి మండలం శనాయిపల్లికి చెందిన పండగ మధుసూధన్ రెడ్డి కొడుకు లోహిత్ (12) హయత్ నగర్ లోని ఓ కార్పొరేట్​స్కూల్​లో ఏడో తరగతి చదువుతూ హాస్టల్​లో ఉంటున్నాడు. 

సోమవారం రాత్రి తాను ఉంటున్న రూంలో టవల్ తో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత తోటి విద్యార్థులు గమనించి వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారు అక్కడికి చేరుకొని పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం, హాస్టల్ సిబ్బంది, టీచర్స్ వేధింపులే తన కొడుకు చావుకు కారణమని, చదువు చెప్పమని రూ.లక్షలు చెల్లిస్తే శవాన్ని   ఇచ్చారని లోహిత్​తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. 

తన కొడుకు చనిపోయిన సంగతి చెప్పలేదని, పోలీసులు చెబితే వచ్చామన్నారు. కాగా, స్టూడెంట్ మృతితో స్కూల్ ముందు పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.    విద్యార్థి సంఘ లీడర్లను   అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న మిగతా స్టూడెంట్స్ పేరెంట్స్​తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.