- పిల్లాజెల్లతో కదిలిన ఆదిలాబాద్ జిల్లా కుండి షేక్ గూడ వాసులు
- కలెక్టరేట్ ఎదుట వంటావార్పు
ఆదిలాబాద్, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లయినా ఆ ఊరికి నీటి వసతి లేదు.. రోడ్లు అసలే లేవు. తెలంగాణ వచ్చినంక కూడా వారి గోస తీరలేదు. ఓపిక నశించి.. ఊరంతా ఏకమై పిల్లా జెల్లతో కలిసి 60 కి.మీ. నడిచి వచ్చి కలెక్టర్ ఆఫీసు ముందే నిరసనలకు దిగింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండి షేక్ గూడకు చెందిన ఆదివాసీల గురించే ఇదంతా. తమ గ్రామానికి రోడ్డు, తాగేందుకు నీళ్లు లేవని 300 మంది ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద రెండు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోనే వంటావార్పు నిర్వహించారు. ‘‘తాగునీటి కోసం ఇప్పటికీ కిలోమీటర్ల దూరం నడిచివెళ్తున్నం. కొండపైన వ్యవసాయ బావి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నం. ఎన్నో ఏళ్లుగా ఇదే గోస. ఎన్ని సార్లు చెప్పినా ఏ లీడరూ, ఏ ఆఫీసరూ పట్టించుకున్న పాపాన పోలేదు” అని కుండి షేక్ గూడ వాసులు వాపోయారు. అంగన్‌వాడీ భవనం కట్టించాలని, ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇప్పించాలని, స్పష్టమైన హామీ ఇచ్చేదాకా కదిలేది లేదని తేల్చిచెప్పారు. తల్లిదండ్రులు రిలే దీక్షల్లో ఉండటంతో.. వారి పిల్లలకు సీపీఎం ఆఫీసులో ఆ పార్టీ కార్యకర్తలు చదువు చెబుతున్నారు.