వనపర్తి జిల్లాలో నగలు, పందుల చోరీ కేసుల్లో పలువురు అరెస్టు

వనపర్తి జిల్లాలో నగలు, పందుల చోరీ కేసుల్లో పలువురు అరెస్టు
  • వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు

వనపర్తి , వెలుగు: ఇటీవల జిల్లాలో జరిగిన వివిధ నేరాల్లో నిందితులైన 8 మందిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 24న ఖిల్లాగణపురంలోని నారాయణదాసు వెంకటేశా చారి బంగారం వర్స్​ షాప్​లో దొంగతనం చేసిన నిందితుడు పంతగాని మన్నెంకొండ బస్టాండు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

దీంతో బంగారు దుకాణంలో చోరీతో పాటు బజారు ఆంజనేయస్వామి ఆలయంలో పూజా సామగ్రి, ఆంప్లిఫయర్, చిన్న విగ్రహాలు చోరీ చేసినట్లు ఒప్పకున్నాడు. అతడి వద్ద నుంచి 14 గ్రాముల బంగారు, 6.15కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

పందుల చోరీ కేసులో..

నవంబరు 26న గోపాల్​పేట మండలం ఏదుట్లలో వెంకటయ్య, వెంకటరమణలకు చెందిన పందుల షెడ్డు నుంచి 50 పందులను దొంగిలించిన అయిజ మండలానికి చెందిన ఎరుకలి ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. కర్నూలుకు చెందిన తన స్నేహితులు బాలరాజు, మహేశ్ కలిసి బొలెరో వాహనంలో పందులను తరలించి బెంగళూరులో అమ్ముకున్నారని వెల్లడించారు.

పెద్దమందడి మండలంలోనూ 25 పందులను చోరీ చేసినట్లు చెప్పారు. బొలెరో వెహికిల్​ ఉన్న మహేశ్ ​బైక్​పై ముందు గోపాల్​పేట, పెద్దమందడి మండలాల్లో రెక్కి నిర్వహించి స్నేహితులకు సమాచారమివ్వగా.. వారంతా కలిసి పందుల దొంగతనం చేసేవారు. తాజాగా బైక్​పై గోపాల్​పేట ప్రాంతానికి వచ్చిన మహేశ్​రెక్కి చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.  

సెల్​ఫోన్ల చోరీలు

పెబ్బేరులో శనివారం సంత రోజున సెల్​ఫోన్ల దొంగతనం చేసిన ఏపీలోని ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన లక్ష్మీదుర్గారావు, లక్ష్మణ్, సాగర్​బాబు, షేక్​బాబులను అరెస్టు చేసి వారి నుంచి రెండు సెల్​ఫోన్లు, ఒక ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. వీరు నలుగురు ఒక గ్యాంగ్​గా ఏర్పడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రద్దీ ప్రాంతాలలో చోరీలు చేస్తున్నారని డీఎస్పీ తెలిపారు.

వీరందరినీ ఆయా ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారని తెలిపారు. సమావేశంలో కొత్తకోట సీఐ రాంబాబు, ఖిల్లాగణపురం, పెద్దమందడి, గోపాల్​పేట, పెబ్బేరు ఎస్సైలు సురేశ్​ గౌడ్, యుగంధర్​రెడ్డి, హరిప్రసాద్​ రెడ్డి, నరేశ్​కుమార్ ​పాల్గొన్నారు.