కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవికి  పోటాపోటీ

 కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవికి  పోటాపోటీ
  • తీవ్ర ప్రయత్నాల్లో పలువురు ఆశావహులు
  • పాలక మండలి కోసం100కి పైగా దరఖాస్తులు
  • ముఖ్య నేతల మద్దతు కోసం ప్రయత్నాలు

సిద్దిపేట, వెలుగు:  కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ పదవి కోసం పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్​27న పాలక మండలి  ఏర్పాటు కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా100 మందికి పైగా అప్లై చేసుకున్నారు. 14 మందితో పాలక మండలిని ఏర్పాటు చేస్తే  వారిలో ఒకరిని  చైర్మన్ గా ఎన్నుకుంటారు.

మార్చిలో పాలక మండలి ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేసినా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో దానికి బ్రేక్ పడింది. ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించారు. జూన్ 29 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్దకాలంగా కొమురవెల్లి ఆలయ చైర్మన్ పదవి ఎక్కువగా బీసీలకే లభించింది. ఈసారి సైతం స్థానికులకే అవకాశం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.

ముఖ్య నేతల మద్దతు కోసం చక్కర్లు 

కొమురవెల్లి ఆలయ చైర్మన్ తో పాటు పాలక మండలిలో స్థానం కోసం పలువురు కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ, జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్,  జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​రెడ్డి మద్దతు కోసం చక్కర్లు కొడుతున్నారు. పాలక మండలిలో స్థానం కోసం భారీగా అప్లికేషన్లు వచ్చినా అధికారులు వడపోసి 70మంది పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈసారి పది మందికి పైగా మహిళలు సైతం అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఆలయ పాలక మండలి విషయంలో కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్ణయమే ఫైనలయ్యే అవకాశం ఉంది. ఆయన సూచించే వ్యక్తులకే మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చైర్మన్ పదవిపై  జోరుగా ప్రయత్నాలు

కొమురవెల్లి ఆలయ చైర్మన్ పదవి దక్కించుకోవడం కోసం పలువురు సిద్దిపేట జిల్లా నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొమురవెల్లి ఉన్నప్పుడు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కగా గత పదేళ్లుగా బీసీ వర్గాల వారికి అవకాశం లభిస్తోంది. సిద్దిపేట జిల్లాకు చెందిన డజను మంది ముఖ్య నేతలు చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుని మద్దతు ప్రయత్నాల్లో ఉన్నారు.

ముఖ్యంగా గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలిలో ఆయా వర్గాల వారికి ప్రాధాన్యం దక్కుతుండడంతో ఈసారి చాలా మంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు. పునరుద్దరణ కమిటీలోని సభ్యులు కొందరు చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తుతండగా చేర్యాల మండలానికి చెందిన ప్రముఖ నేత పేరు ముందు వరుసలో వినిపిస్తుంది. ఆలయ పాలక మండలిలో వివిధ వర్గాలకు చెందిన 14 మందితో పాటు  ఆలయ పూజారిని ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నియమిస్తారు. ఏది ఏమైనా వచ్చే కొద్ది రోజుల్లో ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.