ఎన్నికల సంస్కరణలను సూచించేందుకు అనేక కమిషన్లు, అధ్యయన బృందాలను ఏర్పాటు చేశారు. సి.సుబ్రహ్మణ్యం, వీఎన్ తార్కుండే, జీవీ మౌలాంకర్, ఏజీ సురాని, ఆర్డీ దేశాయ్‌లతోపాటు టీఎన్ శేషన్, జేఎం లింగ్డో, టీఎస్ కృష్ణమూర్తి తదితరులు ఎన్నికల సంస్కరణలు సూచించారు.
సుప్రీంకోర్టుతో సహా ఎన్నికల సంస్కరణలపై నియామకమైన ప్రతి కమిటీ తన నివేదికల్లో బహుళసభ్య ఎన్నికల సంఘం ఏర్పాటుకు సిఫారసు చేశాయి.
సంయుక్త పార్లమెంటరీ కమిటీ (1972)
ఐదేండ్లకు ఒకసారి జరగాల్సిన ఎన్నికలు, ఉప ఎన్నికల ప్రభావం వల్ల అనేకసార్లు ఎన్నికలను నిర్వహించాల్సి రావడంతో ఒక్క వ్యక్తే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం ఎంతో కష్టతరమైంది. ఒక్క వ్యక్తే అధికార బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు నిరంకుశత్వం, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు గురికావచ్చు. కాబట్టి ఎన్నికల సంఘం 324 (2) అధికరణ ప్రకారం బహుళ సభ్య సంఘంగా ఉండాలని ఈ కమిటీ పేర్కొన్నది.
తార్కుండే కమిటీ (1982)
జనతంత్ర సమాజ్ తరఫున జయప్రకాశ్ నారాయణ్ ఎన్నికల విధానంలో సంస్కరణలను సూచించడానికి ఏర్పాటు చేసిన వీఎం తార్కుండే కమిటీ ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులను కలిగి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని సూచించింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగులను ఎన్నికల సంఘం సభ్యులుగా నియమించరాదని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాదగిన అర్హతలు ఉన్న వారినే ఎన్నికల సంఘం సభ్యులుగా నియమించాలని ఈ కమిటీ సూచించింది.
దినేష్ గోస్వామి కమిటీ(1990)
ఎన్నికల సంస్కరణలపై సిఫారసులు చేయాలని వీపీ సింగ్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న దినేష్ గోస్వామి అధ్యక్షతన కమిటీని నియమించింది. రాజకీయ పార్టీలకు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఖర్చుని నగదు రూపంలో కాకుండా వస్తు రూపంలో ఇవ్వాలి.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేయాలి. మిగిలిన పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మాత్రమే వారి వ్యయాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాలి. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను గుర్తించి ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే అన్ని రాజకీయ పక్షాల వారికి సమకూర్చాలి.
అంశాలకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం ఉండొద్దు. ఎన్నికల పరిశీలనకు ఒక పర్యవేక్షణాధికారిని నియమించే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ వంటివి జరిగినప్పుడు ఓట్ల లెక్కింపు ఆపివేసి, ఫలితాలను వెల్లడించవద్దని రిటర్నింగ్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించాలి.
ఒక అభ్యర్థి ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విధానాన్ని రద్దు చేయాలి. రిజర్వు చేసిన నియోజకవర్గాలను నియమిత కాలాల్లో మార్చుతూ రిజర్వేషన్ లేని అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించడం కోసం ఈవీఎంలను ఉపయోగించాలని సూచించింది.
టీఎస్ కృష్ణమూర్తి సిఫారసులు
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ ఓటు వేయడం ఇష్టం లేని అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశం కల్పించాలి. దానికోసం బ్యాలెట్ పేపర్ లో ఒక బటన్‌ను ఏర్పాటు చేయాలి. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయడానికి అనుమతించాలి.
టీవీల్లో ప్రకటనలకు సంబంధించిన విషయాలపై నియమావళిని రూపొందించాలి. ఎగ్జిట్ పోల్స్‌ను నియంత్రించాలి. ఐదేండ్లపాటు జైలుశిక్ష విధించదగిన నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్న వ్యక్తులను నిర్దోషులని రుజువయ్యేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించాలి.
15వ లా కమిషన్ సిఫారసులు
ఈ లా కమిషన్ అధ్యక్షులు జస్టిస్ జీవన్‌రెడ్డి. ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉండాలి. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఫిరాయింపుదారు వేసే ఓటు చెల్లదని ప్రకటించాలి.
ఎవరికి అధికంగా ఓట్లు పోలైతే వారే గెలిచినట్లు ప్రకటించే ప్రస్తుత విధానంలో రెండంచెల బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనుమతించారు.
గుర్తింపు, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఎన్నికల ట్రస్టు ఏర్పాటు చేసేలా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించాలి. ఒక పార్టీ సంస్థాగత ఎన్నికల్లో 30 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలి.
స్వతంత్ర అభ్యర్థులు మరణించినప్పుడు ఎన్నిక వాయిదా వేయాల్సిన అవసరం లేదని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణిస్తే కొత్త అభ్యర్థి పేరును సూచించడానికి వారం రోజుల సమయం ఇవ్వాలని సూచించింది .
టీఎన్ శేషన్ సిఫారసులు
టీఎన్ శేషన్ సిఫారసుల్లో కొన్నింటిని ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తీసుకువచ్చారు. నామినేషన్లను ఉపసంహరించడానికి నిర్ణయించిన తేదీ నుంచి ప్రచార సమయాన్ని 14 రోజులుగా నిర్ణయించడమైంది.
1996కు పూర్వం ప్రచార సమయం 21 రోజులుగా ఉండేది. ఇది 1997 నుంచి అమలులోకి వచ్చింది. ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయరాదు. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి కాని రద్దు చేయకూడదు.
ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల పరిశీలకులు ఏదైనా నియోజకవర్గాల్లో అక్రమ విధానాలు అవలంబించినట్లయితే ఫలితాన్ని నిలిపివేసే అధికారం రిటర్నింగ్ అధికారి కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఏదైనా విషయంలో నేరం నిరూపణ అయి కనీసం రెండేండ్లు శిక్ష అనుభవించినట్లయితే ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలి.
స్వతంత్ర అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో కనీసం 10 మంది అతని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలి. పోలింగ్ బూత్ సమీపంలోకి ఆయుధాలను తీసుకెళ్లడం నేరంగా పరిగణించాలి. ప్రచార సమయం పూర్తయిన తర్వాత 48 గంటల వరకు మద్యం అమ్మకాలు, పంపిణీ చేయడం నేరంగా పరిగణించాలి.
రాజ్యాంగ పున: సమీక్ష కమిషన్
ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిని చట్టసభల సభ్యులను నేరుగా ఎన్నుకోవాలి. ఏ ఒక్క పార్టీకి లేదా ఎన్నికల ముందే ఏర్పడిన కూటమికి గాని స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, స్పీకర్‌ను ఎన్నుకున్నట్లే సభానాయకుడిని కూడా సభ్యులే ఎన్నుకోవాలి.
సభా నాయకుడిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేటప్పుడే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా తీర్మానంలో స్పష్టంగా పేర్కొనాలి. పంచాయతీ స్థాయి నుంచి ఓటర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మొదట పోస్టాఫీసుల్లో ప్రదర్శించి మార్పులు, చేర్పులను స్వీకరించి తర్వాత వెబ్సైట్లలో పెట్టాలి.
వీలైనంత త్వరగా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టాలి. పోలైన ఓట్లలో కనీసం 50 శాతం + 1 ఓట్లు సాధించినవారినే విజేతలుగా ప్రకటించాలి. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలను రొటేషన్ పద్ధతిలో మార్చాలి. మంత్రు ల సంఖ్యను మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతం మించకుండా చూడాలి.
రెండో పాలనా సంస్కరణల సంఘం సిఫారసులు
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఇద్దరు కమిషనర్ల నియామకం పారదర్శకంగా జరగాలి. ఇందుకుగాను ప్రధాన మంత్రి అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించాలి. ఈ కమిషన్‌లో లోక్‌సభ స్పీకర్, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, న్యాయశాఖ మంత్రి, రాజ్యసభ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సభ్యులుగా ఉండాలి.
ఈ సంఘం ప్రధాన కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల పేర్లను రాష్ట్రపతికి సిఫారసులు చేయాలి. పార్టీ ఫిరాయించిన రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు ఇవ్వాలి.
హత్య, అత్యాచారం, బందిపోట్లు, దొంగతనం, అపహరణ వంటి నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న వారికి పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ టికెట్ ఇవ్వకూడదు.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కలిగిన రాజకీయ పార్టీలు ఎన్నికల కూటమిగా ఏర్పడినప్పుడు ఎన్నికల ముందుగాని లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గాని కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించాలి.