హైదరాబాద్, వెలుగు: సిటీలో రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా కూడా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త ఎందుకు ఉంటుందని కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. డివిజన్లలో తలెత్తుకొని తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కౌన్సిల్ మీటింగ్ లో శానిటేషన్ పై పలువురు కార్పొరేటర్లు ప్రశ్నించారు. భారతీనగర్ కార్పొరేటర్ సింధు, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదిప్య, కార్వాన్ కార్పొరేటర్ స్వామి, ఉప్పుగూడ కార్పొరేటర్ అబ్దుల్ పమీద్ , అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి , మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ , పఠాన్ చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ , చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పలు సమస్యలపై ప్రశ్నించారు.
నవ్వుతూ సమాధానమిచ్చిన అధికారి
శానిటేషన్ పనులపై అడిషనల్ కమిషన్ ఉపేందర్ రెడ్డి ఇచ్చిన సమాధానంపై మేయర్ తో పాటు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీరియస్ గా అడిగితే ఆయన వ్యగంగా నవ్వుతూ సమాధానం చెప్పారు. రాంకీతో 2009 లో అగ్రిమెంట్ అయిందని, కమర్షియల్ ఆపరేషన్ మాత్రం 2012లో ప్రారంభమైందని, రాంకీ చేసే పనులను మానిటర్ చేయడానికి లాగిన్ ద్వారా పరిశీలిస్తున్నామని, మేయర్ అనుమతులు ఇస్తే కార్పొరేటర్లకు ఇస్తామన్నారు. కార్మికులు తక్కువ ఉన్న మాట వాస్తవమేనని, 90 రోజుల కంటే ఎక్కువ ఆబ్సెంట్ ఉంటే రిమూవ్ చేయమని నోటీస్ ఇచ్చామన్నారు. మేజర్ రోడ్ల పై డివైడర్ల వద్ద మెషీన్ తో స్వీపింగ్ చేస్తారన్నారు. ఒక్కో వెహికల్ కు ఏడాదికి 1 కోటి 25 లక్షల వరకు చెల్లిస్తున్నామన్నారు.