
- అడ్డుకొని అధికారులతో మాట్లాడించిన పోలీసులు
- తమకు చెప్పకుండా పొలాల్లో కడీలు పాతారని రైతుల ఆవేదన
- పరిహారం ఇవ్వకుండా ఫ్యూచర్‌సిటీకి రోడ్డేస్తున్నారని ఆందోళన
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: కొంగరకలాన్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్‌ముందు సోమవారం పలువురు రైతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. తమకు ఎలాంటి సమాచారం, పరిహారం ఇవ్వకుండానే ఫ్యూచర్‌సిటీకి 300 ఫీట్ల రోడ్డు వేసేందుకు పోలీస్పహారా నడుమ కడీలు పాతుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోబోతే పోలీసులు అక్కడి నుంచి పంపించేస్తున్నారని వాపోయారు. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు రైతులను అడ్డుకుని సంబంధిత అధికారులను కల్పించారు.
మహేశ్వరం మండలం రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్13 నుంచి కందుకూరు మండలం బేగారికంచ ఫ్యూచర్ సిటీ వరకు ప్రభుత్వం 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మించబోతుంది. ఇందుకోసం ప్రభుత్వం 449.27 ఎకరాలు సేకరిస్తోంది. గ్రామాల వారీగా రైతులు కోల్పోతున్న భూముల వివరాలను ఆయా పంచాయతీల్లో ఉంచారు. అయితే కొంగరకుర్దు రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు.13లో రోడ్డు కోసం 10.06 ఎకరాల్లో అధికారులు సోమవారం కడీలు పాతారు.
భూములు కోల్పోతున్న రైతులు కాసుల బాలరాజ్(2.17ఎకరాలు), కాసుల సుధాకర్(1.31ఎకరాలు), గున్నాల నర్సింహ(3.20 ఎకరాలు), గూదె రమాదేవి( 0.20 ఎకరాలు) అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. బాధిత రైతులు కలెక్టరేట్వద్దకు చేరుకుని ఆత్మహత్యకు యత్నించారు. పరిహారం చెల్లించకుండా వ్యవవసాయ భూముల్లో రాళ్లు పాతడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా రెవెన్యూ అధికారి రైతులతో మాట్లాడి, సర్దిచెప్పారు. తర్వాత రైతులు మాట్లాడుతూ.. తమ ప్రాణం పోయినా సరే రోడ్డుకు భూములు ఇవ్వబోమన్నారు.