రికార్డుల మహా కుంభమేళా.. మెగా ఈవెంట్‎లో పలు గిన్నిస్ రికార్డులు నమోదు

రికార్డుల మహా కుంభమేళా.. మెగా ఈవెంట్‎లో పలు గిన్నిస్  రికార్డులు నమోదు
  • 10 వేల మంది 8 గంటల్లో హ్యాండ్ ప్రింట్ పెయింటింగ్  
  • ఊహించిన దాని కన్నా ఎక్కువే యాత్రికుల హాజరు

ప్రయాగ్ రాజ్: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయాగ్ రాజ్‎​లో 45 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగిన మహా కుంభమేళాలో పలు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ఈ మెగా ఈవెంట్‎లో ఏకకాలంలో అతిపెద్ద స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. మేళా జరిగిన ప్రాంతంలోని నాలుగు జోన్లలో 15 వేల మంది పారిశుధ్య కార్మికులు ఒకే సమయంలో క్లీన్లీనెస్  డ్రైవ్ నిర్వహించారు. అలాగే.. పదివేల మంది వలంటీర్లు ఒకేసారి 8 గంటల్లో హ్యాండ్ ప్రింట్ పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్ పొడవు 80 అడుగులు, వెడల్పు ఐదడుగులు.

ఇక, కుంభమేళాకు 45 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేయగా.. 66 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. దీంతో కుంభమేళా రికార్డులు క్రియేట్ చేసిందని గిన్నిస్ నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి రోజు కోటిమందికిపైగా భక్తులు పుణ్యస్నానం చేయడం కూడా గిన్నిస్ రికార్డని వెల్లడించారు. అతిపెద్ద స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించినందుకు యోగి సర్కారుకు గిన్నిస్ నిర్వాహకులు మొత్తం మూడు అవార్డులు అందజేశారు.

15 రోజుల స్వచ్ఛతా కార్యక్రమం ప్రారంభం

కుంభమేళా ముగియడంతో శుక్రవారం మహాకుంభ్ నగర్‎లో 15 రోజుల క్లీన్లీనెస్  డ్రైవ్ ప్రారంభించారు. స్పెషల్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పారిశుధ్య కార్మికులను ‘స్వచ్ఛతా మిత్రాస్’, ‘గంగా సేవాదూత్’ గా పేరుపెట్టి అధికారులు పనులు చేయిస్తున్నారు. ఈ 15 రోజుల్లో సంగం ఘాట్లు, మేళా గ్రౌండ్ రోడ్లు, పర్మనెంట్, టెంపరరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లను శుభ్రం చేయనున్నారు. 

మేళా టైంలో ఏర్పాటు చేసిన 1.5 లక్షల తాత్కాలిక టాయిలెట్లను డిస్మాంటిల్ చేయనున్నారు. 45 రోజుల్లో జనరేట్ అయిన వ్యర్థాలను నైనీలోని బస్వార్ ప్లాంట్‏​లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేస్తారు. అలాగే.. తాత్కాలిక పైప్ లైన్లు, స్ట్రీట్ లైట్లు, టెంట్లు, పెవిలియన్లను తొలగించనున్నామని అధికారులు తెలిపారు.