నో రిజిస్ట్రేషన్.. నో రూల్స్​!.. 242 క్లీనిక్ లకు నోటీసులు

నో రిజిస్ట్రేషన్.. నో రూల్స్​!.. 242 క్లీనిక్ లకు నోటీసులు
  • భారీగా పుట్టుకొస్తున్న క్లీనిక్స్, హాస్పిటల్స్  
  • వీటిలో రిజిస్ట్రేషన్ అయినవి 2,300 మాత్రమే
  • రూల్స్ పాటించని 242 క్లీనిక్ లకు నోటీసులు
  • మరో 144  క్లీనిక్స్ కు పెనాల్టీ విధించి వసూలు 
  • హైదరాబాద్​జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో గల్లీ గల్లీకో క్లీనిక్, హాస్పిటల్​ఉంటాయి. కానీ.. వాటికి రిజిస్ట్రేషన్ ఉంటుందో .. ఉండదో తెలియదు. రూల్స్ పాటిస్తాయో లేదో కూడా చెప్పలేం.  హైదరాబాద్ జిల్లాలో రోజురోజుకు క్లీనిక్, హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్లు ​పుట్టుకొస్తున్నాయి.  వీటిలో ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ, యోగ, నేచురోపతి, పాలి క్లీనిక్స్  వెల్ నెస్, ఫిజియోథెరఫీ సెంటర్లు, కంటి, డెంటల్ క్లినిక్స్​పేరుతో ఏర్పాటు అవుతున్నాయి. 

 అయితే.. ఎష్టాబ్లిష్ ​మెంట్​యాక్ట్ – 2016  కింద ప్రతి ఒక్క క్లీనిక్, హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్​ రూల్స్ పాటించాలి. మస్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. జిల్లాలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయిన క్లీనిక్స్ కేవలం 2,300 మాత్రమే ఉండగా.. చేసుకోనివి వేలల్లో ఉంటాయని అధికారుల అంచనా. ఇటీవలే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు చేసి  రిజిస్ట్రేషన్ చేసుకోని, రూల్స్ పాటించని 242  క్లీనిక్స్ కు నోటీసులు జారీచేశారు. 2023 నుంచి ఇప్పటివరకు మొత్తం 144  క్లినిక్స్ కు పెనాల్టీ విధించారు. దీని ద్వారా ఇప్పటివవకు 16 లక్షలకు పైనే వసూలైందని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. 

ఎష్టాబ్లిష్ మెంట్ రూల్స్ ఇలా..  

క్లీనికల్ ఎష్టాబ్లిష్​ మెంట్ యాక్టు కింద ప్రతి క్లీనిక్​, హాస్పిటల్​పరిశుభ్రత, అందించే సౌకర్యాల్లో ప్రమాణాలు మస్ట్ గా పాటించాలి. డాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్లు, విద్యార్హతలు కూడా రిసెప్షన్ వద్ద బోర్డులో తెలపాలి. వసూలు చేసే ఫీజుల వివరాలు మస్ట్ గా తెలుగు, ఇంగ్లీష్ లో బోర్డులు పెట్టాలి. ఓల్డ్ సిటీలోనైతే ఉర్దూలో కూడా రాయించాలి. ఆ రేట్ల మేరకే  పేషెంట్ల నుంచి చార్జీలు వసూలు చేయాలి. నిర్వాహకులు నిర్ణయించిన రేట్స్ (రాక్ రేట్లను) ప్రతి ఏడాది జూన్ మొదటివారంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆఫీసులో అందించాలి. మలేరియా, డెంగ్యూ, టీబీ, హెచ్ఐవీ వంటి వ్యాధులు సోకిన బాధితుల వివరాలను ప్రతినెలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు తెలపాలి. వచ్చిన జబ్బుల గురించి  పేషెంట్లకు మస్ట్ గా అర్థమయ్యే భాషలో వివరించాలి. చికిత్సకు అయ్యే ఖర్చులను కూడా ముందుగానే చెప్పాలి.  రోగుల హక్కులు, బాధ్యతలు ప్రతి ఆస్పత్రిలో తెలిపే విధంగా బోర్డుల్లో ఉండాలి. పై రూల్స్ పాటించని క్లీనిక్​, హాస్పిటల్​పై క్లీనికల్​ఎష్టాబ్లిష్​ మెంట్ యాక్ట్ కింద జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారు. 

కలెక్టర్ దిశానిర్దేశం చేయగా..  

రాష్ట్రంలో 2022 జూన్14 నుంచి క్లినికల్ ఎష్టాబ్లిష్ మెంట్ యాక్ట్ –-2016 అమలులోకి వచ్చింది. గత మే నెలలో యాక్ట్​ పై హైదరాబాద్​కలెక్టర్ అనుదీప్​ జిల్లా అధికారులతో మీటింగ్ నిర్వహించి యాక్టుపై దిశానిర్దేశం చేశారు. రూల్స్ పాటించని, రిజిస్టర్​ చేసుకొని క్లీనిక్స్, హాస్పిటల్స్​పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు ఒక కమిటీని కూడా నియమించారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎం టీమ్ లు రెండు నెలల్లో రిజిస్టర్ చేసుకొని ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ, యోగ, నేచురోపతి, పాలి క్లీనిక్స్ , ల్యాబ్ లు, హాస్పిటల్స్, వెల్ నెస్ సెంటర్లు, ఫిజియోథెరఫీసెంటర్లు, కంటి క్లీనిక్స్​ఇలా మొత్తంగా 242  క్లీనిక్స్ ను అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. 2023 నుంచి ఇప్పటివరకు 144  క్లీనిక్స్ కు పెనాల్టీ వేశారు.  రూల్స్ పాటించని 4 హాస్పిటల్స్​ను సీజ్​చేశారు.  వాటి నుంచి రూ.16లక్షలకు పైనే పెనాల్టీ వసూలు చేశారు. అదేవిధంగా హాస్పిటల్స్, క్లీనిక్స్​లో ఫైర్ సేఫ్టీ కి సీనియర్​పబ్లిక్​హెల్త్​ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్​వోలతో హైదరాబాద్​ జిల్లాలో మొత్తం15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీలు 255 హాస్పిటల్స్​లో ఫైర్​ సేఫ్టీ, ఎన్​వోసీలు ఉన్నాయా లేవా అని చెకింగ్​చేశాయి. ఫైర్​సేఫ్టీ లేని ఓ  హాస్పిటల్ సీజ్​ చేశారు. రిజిస్టర్​ చేసుకోని, రూల్స్ పాటించని వాటికి నోటీసులు ఇచ్చారు. గడువులోపు నిర్వాహకులు స్పందించకుంటే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

సర్వే చేయిస్తున్నాం 

జిల్లాలో ప్రతి ఒక్క క్లీనిక్, హాస్పిటల్​మస్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. గడువు ముగిస్తే వెంటనే  రెన్యూవల్ చేసుకోవాలి. లేదంటే క్లీనికల్ ఎష్టాబ్లిష్ మెంట్​యాక్ట్ కింద యాక్షన్ తీసుకుంటాం.  ఇప్పటివరకు 242 క్లీనిక్స్​, హాస్పిటల్స్ కు నోటీసులిచ్చాం. ప్రస్తుతం జిల్లాలో క్లీనిక్స్, హాస్పిటల్స్​గుర్తించేందుకు సర్వే చేయిస్తున్నాం. అనంతరం రిజిస్ట్రేషన్ లేనివాటిని గుర్తించి చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ వో, హైదరాబాద్ జిల్లా