తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో నాలుగున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో చాలా అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో చర్చించిన.. తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి హరీష్ రావు మీడియాకు తెలిపారు.
త్వరలో దళితబంధు పథకం రెండో విడత ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దళితబంధులో ఒక లక్షా 30 వేల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
హుజూరాబాద్‌లో వందశాతం లబ్ధిదారులకు దళితబంధు అందించామన్నారు మంత్రి హరీష్ రావు. మిగతా 118 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులకు అందించనుండగా.. మరో 200 మందికి చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేయనున్నామన్నారు.
కీలక నిర్ణయాలు..
సొంత స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పథకానికి ‘గృహలక్ష్మి పథకం’గా పేరు పెడుతున్నామని తెలిపారు.
* రాష్ట్రంలోని లక్షా 30 వేల కుటుంబాలకు దళితబంధు పథకం ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
* గృహలక్ష్మీ పథకం ద్వారా 4 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయం. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3వేల ఇళ్ల చొప్పున మంజూరు
* లబ్ధిదారుడు తనకు నచ్చిన విధంగా కట్టుకునే విధంగా నిబంధనలు సులభతరం. రూ.12 వేల కోట్ల నిధుల కేటాయింపు
* ఒక్కో ఇంటికి రూ.3 లక్షలు గ్రాంటుగా ఇవ్వనున్నారు.
* ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకూ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని చెప్పారు. ఇదంతా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరగాలని, పారదర్శకంగా, వేగంగా జరగాలని నిర్ణయించామన్నారు. గొర్రెల పంపిణీకి 4 వేల 430 కోట్లు కేటాయించామన్నారు.
* పొడు భూముల సమస్య పరిష్కారారిని నిర్ణయం తీసుకున్నామన్నారు. 4 లక్షల ఎకరాల పొడు భూములను అర్హులైన గిరిజనులకు పంపిణీ చేస్తామన్నారు. ఒక లక్షా 53 వేల మంది అర్హులు ఉన్నారన్నారు.
* ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ లో నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తామన్నారు. గ్రామాలు, పట్టణాల నుంచి ప్రజల నుంచి తీసుకొచ్చి.. విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. విగ్రహావిష్కరణ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
* జీవో 58,59 కింద నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.
* కాశీలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు.
* కేరళ శబరిమలలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు.