
అంబర్పేట, వెలుగు: గతంలో పత్రికలు, జర్నలిజం విలువలకు ప్రతి రూపంగా ఉండేవని, ప్రస్తుతం ఆ విలువలు పడిపోతున్నాయని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి అన్నారు. సమాజంలో మంచి విలువలు పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి నేత ఫణి భార్గవ్ జయంతి సందర్భంగా కళానిలయం, శ్రీత్యాగరాయ గానసభ ఆధ్యర్యంలో సోమవారం త్యాగరాయ గానసభలో సీనియర్ రిపోర్టర్లు గండ్ర నవీన్(వీ6 వెలుగు), పి.రాధిక(ఎన్టీవీ), పి.జ్యోతి(టీవీ9), సుందరయ్య విజ్ఞాన కేంద్ర మేనేజర్వినయ్కుమార్(ఎస్వీకే)తోపాటు పలువురు జర్నలిస్టులను ‘యువ జర్నలిస్ట్ ప్రతిభా పురస్కారం’తో సత్కరించారు.
బాలభవన్ మాజీ డైరెక్టర్ ఎం.కె.రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా మధుసూదనాచారి, సీనియర్ జర్నలిస్ట్కె.రామచంద్రమూర్తి పాల్గొని అవార్డులను అందజేశారు. విద్యార్థి నేత పేరిట అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. జర్నలిజాన్ని పవిత్రంగా భావించి, ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. త్యాగరాయగానసభ అధ్యక్షుడు వీఎస్ జనార్థన్ మూర్తి, సీనియర్జర్నలిస్టులు బైస దేవిదాస్, రమణ తదితరులు హాజరై మాట్లాడారు.