మా కులాలను బీసీలో చేర్చండి

 మా కులాలను బీసీలో చేర్చండి
  • మాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది
  • బీసీ కమిషన్​ను కోరిన 26 కుల సంఘాల నేతలు
  • 10 ఉమ్మడి జిల్లాల్లో ముగిసిన పబ్లిక్ హియరింగ్
  • డిసెంబర్ మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీ వర్గం నుంచి తొలగించిన 26 కులాలను మళ్లీ అందులోనే చేర్చాలని పలువురు నేతలు బీసీ కమిషన్​ను కోరారు. బీసీ వర్గం నుంచి తొలగించడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. 10 ఉమ్మడి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ ముగిసింది. సోమవారం ఖైరతాబాద్​లోని బీసీ కమిషన్ ఆఫీస్​లో హైదరాబాద్ వాసులు, కుల సంఘాల కోసం కమిషన్.. పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. మంగళవారం కూడా కొనసాగనున్నది. సుమారు 58 సంఘాలు, 600 మంది హాజరయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు బాలలక్ష్మి, సురేందర్, జయప్రకాశ్​కు వినతిపత్రాలు, సలహాలు, సూచనలు, అఫిడవిట్ల రూపంలో అందజేశారు.

 జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎంబీసీల్లో ఉన్న సంచార జాతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని వివరించారు. బీసీల్లో కేవలం 5 కులాలకే నిధులు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడారు. జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లతో పాటు ఏ, బీ, సీ వర్గీకరణ కోసం కుల గణన ఉపయోగపడుతుందన్నారు. గణనలో వివరాలు అందించనివాళ్లు వెంటనే ఇవ్వాలని కోరారు. 

కుల గణనకు సహకరించండి: గోపిశెట్టి నిరంజన్

రాష్ట్రంలో ఏ కులంలో.. ఎంత మంది ఉన్నారో అధికారిక లెక్కలు లేవని నిరంజన్ తెలిపారు. ‘‘ఓటర్ లిస్ట్ ప్రకారం కులాల వారీగా జనాభా తెలియదు. ఇంటింటి సర్వే ద్వారానే తెలుస్తది. సిబ్బంది లేకపోవడంతో బాధ్యతలు ప్లానింగ్ డిపార్ట్​మెంట్​కు సీఎం రేవంత్ అప్పగించారు. జిల్లాల్లో పర్యటించినప్పుడు కుల గణన చేస్తున్న ఎన్యుమరేటర్లను కలిశాం. డేటా భద్రతపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నాం. ఫిల్ చేసిన అప్లికేషన్లను ట్రంక్ పెట్టెల్లో భద్రపరుస్తున్నట్లు కలెక్టర్లు చెప్పారు. 87వేల మంది ఎన్యుమరేటర్లు కుల గణనలో పాల్గొంటున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం, బీసీ కమిషన్ హైకోర్టుకు అందజేస్తుంది. 

10 జిల్లాల్లో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్​లో 1,224 వినతులు వచ్చాయి. వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. తార్నాకలో ప్రశ్న పత్రాలు రోడ్డు మీదకు వచ్చాయనే వార్త విన్నాం. మేడ్చల్ కలెక్టర్​కు రిపోర్ట్ అడిగినం. టూ వీలర్ మీద తీసుకెళ్తుంటే కింద పడ్డాయని కలెక్టర్ చెప్పారు. బాధ్యుడిగా ఉన్న సూపర్​వైజర్​ను సస్పెండ్ చేశామన్నరు’’అని నిరంజన్ చెప్పారు.