పార్టీ​ మీటింగ్‌కు ఆరుగురు BRS ఎమ్మెల్యేలు డుమ్మా

పార్టీ​ మీటింగ్‌కు ఆరుగురు BRS ఎమ్మెల్యేలు డుమ్మా

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌ నుంచి ఫిరాయింపుల పర్వం కొనసాగుతున్నది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారగా, ఇదే విధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి టీమ్​గా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో  గ్రేటర్​ హైదరాబాద్​కు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలతో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్​ పార్టీ మీటింగ్‌కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. 

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో శుక్రవారం భవన్‌లో సమావేశం నిర్వహించారు. కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించనున్నట్టు నేతలకు సమాచారం ఇచ్చారు. కానీ, ఆయన ఢిల్లీకి వెళ్లడంతో మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

సమావేశానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే - ముఠా గోపాల్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే - ప్రకాశ్​ గౌడ్, సికింద్రాబాద్​ఎమ్మెల్యే -పద్మారావు గౌడ్ హాజరయ్యారు. సుమారు 30 మంది కౌన్సిలర్లు మాత్రమే అటెండ్​ అయ్యారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి గెలిచిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్​ చేస్తూ మీటింగ్‌‌‌‌లో పట్టుబట్టాలని పార్టీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్​నాయకులు సూచించారు. కౌన్సిల్ హాల్లో బైఠాయించాలని చెప్పారు. ఈ డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో మేయర్, డిప్యూటీ మేయర్ల పదవీకాలం నాలుగేండ్లు పూర్తవుతున్నది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 4 ఏండ్ల వరకూ మేయర్, డిప్యుటీ మేయర్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అప్పటివరకూ కౌన్సిల్‌‌‌‌లో గట్టిగా నిరసన తెలిపాలని మీటింగ్‌‌‌‌లో నిర్ణయించారు.

మీటింగ్​కు వెళ్లని ఎమ్మెల్యేలు వీళ్లే

భవన్‌‌‌‌లో జరిగిన ఈ మీటింగ్‌‌‌‌కు శేర్​లిగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్‌‌‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, అంబర్‌‌‌‌‌‌‌‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌‌‌‌, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్‌‌‌‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి డుమ్మా కొట్టారు. ముందస్తుగా నిర్ణయించిన ఇతర కార్యక్రమాలు ఉండడం వల్లే సమావేశానికి వెళ్లలేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్‌‌‌‌లో చేరుతున్న ఎమ్మెల్యేల లిస్టులో వీరి పేర్లు కూడా ఉన్నాయని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

బండారి లక్ష్మారెడ్డి ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌‌‌‌ సన్నిహితుడిగా పేరున్న రోహిణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తన మామ మల్లారెడ్డితో కలిసి మర్రి రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి గతంలో కాంగ్రెస్ నేత, కర్నాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌ను కలిసొచ్చారు. అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేకానందగౌడ్ తదితరులకు గతంలో టీడీపీలో రేవంత్‌‌‌‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే వారు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరుతున్నారనే టాక్​ నడుస్తోంది.