
వేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం ఉదయం పటాన్ చెరు వైపు వెళ్లే రహదారిపై నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం పటాన్ చెరు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమదానికి అతి వేగమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.