నాగర్ కర్నూల్ లో కుక్కల దాడిలో పలువురికి గాయాలు

 నాగర్ కర్నూల్ లో కుక్కల దాడిలో పలువురికి గాయాలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  మున్సిపాలిటీ పరిధిలోని నెల్లికొండ గ్రామంలో మంగళవారం వీధి కుక్కలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులతో పాటు స్కూల్​కు వెళ్తున్న వారిపై దాడి చేయడంతో నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. అలాగే ఓ మహిళపై కూడా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్  ఆసుపత్రికి తరలించారు. 

మక్తల్: మక్తల్  పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో మంగళవారం మధ్యాహ్నం బాలికపై వీధి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయలయ్యాయి. గద్వాల పట్టణానికి చెందిన ఆరాధ్య(6)పై కుక్క దాడి చేయడంతో తీవ్ర  గాయమైంది. గద్వాల పట్టణానికి చెందిన సారిక, శేఖర్ గౌడ్  దంపతులు కూతురుతో కలిసి పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న తమ బంధువు ఆనంద్ గౌడ్  ఇంటికి వచ్చారు. ఆరాధ్య ఇంటి ముందు ఆటాడుకుంటుండగా, వీధి కుక్క దాడి చేసింది. ఆమెను మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్  జిల్లా ఆసుపత్రికి తరలించారు.