జమ్మూ కాశ్మీర్‎లో ఘోర ప్రమాదం.. భారీ లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

జమ్మూ కాశ్మీర్‎లో ఘోర ప్రమాదం.. భారీ లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో ఘోర ప్రమాదం జరిగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం లోయలో బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో పలువురు జవాన్లు గాయపడ్డారు. అధికారుల వివరాల ప్రకారం.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 181 బెటాలియన్‌కు చెందిన వాహనం మంగళవారం (ఏప్రిల్ 29) బీర్వా హర్దు పంజూలోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సిబ్బందిని తీసుకువెళ్తుండగా.. బుద్గాం జిల్లా ఖాన్‌సాహిబ్ తహసీల్ పరిధి దూధ్‌పత్రిలోని తంగ్నార్ కొండ ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. 

సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని తక్షణ వైద్య సహాయం కోసం ఖాన్‌సాహిబ్‌లోని సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (SDH)కు తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న పది మంది జవాన్లను ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇద్దరు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉన్నట్లు వెల్లడించారు.

ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం లేదా వాహనంలో సాంకేతిక కారణం వల్ల లోయలో పడిపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ ను జల్లెడ పడుతున్నాయి. ప్రమాదానికి గురైన జవాన్లు కూడా సెర్చ్ ఆపరేషన్‎కు వెళ్తుండగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.