మల్లన్న సన్నిధిలో.. ఆధ్యాత్మిక మల్లయుద్ధం

విశ్లేషణ: సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నట్లు మల్లన్న మానవాతీతమైన మహిమలు ఉన్న దేవుడు కాడు. దక్కన్ జాతి గొర్రెల బ్రీడును తయారుచేసి, మన్నెం (వలస) దారులు కనిపెట్టి, గొర్రెల మందలకు రక్షకుడిగా ఉన్న మల్లయోధుడు, చారిత్రాత్మక పురుషుడు.  ఈయన సోదరుడే (కజిన్) బీరన్న.  వీరిద్దరూ  క్రీస్తు పూర్వం 3500 ప్రాంతంలో కృష్ణ-–బీమ నదీ పరీవాహక ప్రాంతంలో జన్మించారు. సింధు నాగరికతలోని  పశుపాలకులైన ‘అభీర్-దన్ ఘర్’ల్లలోని ‘హట్కార్’ తెగకు సంబంధించినవారు. ఆర్యుల దండయాత్ర మూలంగా పశు సంపదలను, పచ్చిక బయళ్లను కోల్పోయి, మిగిలిన మందలతో వలస జీవనం కొనసాగించారు. కొంతకాలం తర్వాత నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ను  స్థావరంగా చేసుకుని సంచార జీవనంలో భాగంగా కొల్లాపూర్ నుండి శ్రీశైలం, చెరువుగట్టు,  గొల్లగట్టు (సూర్యాపేట), కొలనుపాక, కొమురవెల్లి, ఐనవోలు, కట్ట,  ఓదేల, కత్తెరశాల ప్రాంతానికి చేరుకొని, తిరుగు ప్రయాణంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతం నుండి ఆర్మూర్, పెద్దాపురం, ఎల్లారెడ్డి, జహీరాబాద్, కొస్కి, కొడంగల్  మీదుగా కొల్లాపూర్​కు  చేరుకున్నారు. ఈ తూర్పు వలసలకు మల్లన్న నాయకత్వం వహించగా, బీరన్న పడమటి వలసలకు  ప్రాతినిధ్యం వహించి మందలను పెద్దయేరు  (పెబ్బేరు), కర్నూలు, బెంగళూరుల మీదుగా ఊటీ కొండలకు తీసుకెళ్లి, కర్ణాటక రాష్ట్రం మధ్య ప్రాంతం నుండి తిరిగి కొల్లాపురంకు  మలిపినారు. 

మల్లన్న జీవిత చరిత్రపై ఉన్న కథలు..
అడవులను, నదులను, వలస మార్గాలను తోటి కాపరులకు తెలియజేయడానికి ప్రత్యేకమైన రంగులతో జాగ్రఫీ మేప్‌‌‌‌లను  రూపొందించిన మేధావులు వారు. ఆ వలసల చిత్రపటాలే నేడు చిన్న పట్నం, పెద్ద పట్నం, చెల్క పట్నంగా రూపాంతరం చెందాయి. జానపద -పౌరాణిక సాహిత్యంలో మల్లన్న జీవిత చరిత్ర పై బంగారు గొర్రె, ఓడు పందెం, బండారిగడ్డ, కాపులఘట్టం, గొల్ల కేతమ్మ, శ్రీశైల మల్లన్న, కుంటి మల్లారెడ్డి కథ అనే ఏడు రకాల వెర్షన్స్ ఉన్నాయి. ఓరల్‌‌‌‌ ట్రెడిషన్‌‌‌‌లో ఉన్న అసలు కథకు సంస్కృతీకరణ, క్షత్రీయకరణలో భాగంగా నూతన వర్షన్​లు పుట్టుకొచ్చాయి. మల్లన్న మక్కాకు వెళ్లి తురకలను  నమ్మించి బంగారి గడ్డను తిరిగి సంపాదించాడు అని వివరించే బండారుగడ్డ కథను ఒక  ఎగ్జాంపుల్‌‌‌‌గా చెప్పొచ్చు.  బ్రాహ్మణ భ్రమరాంబిక, బ్రాహ్మణ రత్నాంగి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ, కాపు కులస్తురాలైన పడిగికాళ్ల పద్మావతిలను మల్లన్న భార్యలుగా చెప్పినా, గొల్ల కేతమ్మ మాత్రమే అసలైన భార్య. శ్రీశైలం గుడిని ఆక్రమించడానికి భ్రమరాంబికను, ముస్లిం వ్యతిరేకతను నింపే ప్రయత్నంలో  రత్నాంగి పాత్రలను బ్రాహ్మణీయ సాహిత్యం సృష్టించింది.  భక్తి పారవశ్యంతో వెంకటేశ్వర స్వామిని బీబీ నాంచారి వివాహమాడినట్లుగా బలిజ మేడలమ్మ మల్లన్నకు అంకితమైంది.  ఇక, పద్మావతి వరరచ్చ మల్లారెడ్డి భార్య. 

శూద్ర దేవాలయాలను ఆక్రమించి..
వాస్తవానికి మనదేశంలో ఆర్యుల రాకతోనే  దేవుడు అనే భావం పరిచయం అయ్యింది. అందుకే ఆర్యులు దేవతలుగా చలామణి అయ్యారు. వీరి రాకతో ఇండియాలో మొదట జాతి ఆర్య తర్వాత వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా కుల వ్యవస్థ తయారయ్యింది.  ఇస్లాం పాలకుల దండయాత్రలతో ధ్వంసమైన భారతీయ శూద్ర రాజ్య వంశీకులు, వారి బంధువులు,  ప్రజలు,  ప్రాణ,  మత, సంస్కృతి రక్షణ కోసం వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లి నూతన కులాలుగా ఏర్పడ్డారు.  వాళ్ల వీరగాథలను ప్రచారం చేయడానికి రకరకాల కులవ్యవస్థలు కూడా ఈ కాలం నుంచే పుట్టుకొచ్చాయి. రాష్ట్రకూట పతనం నుండి రెడ్లు,  కాకతీయ ముగింపు నుంచి వడ్డెరలు, ఉప్పరులు, సగరులు ఏర్పడ్డ విధానం దీనికి ఎగ్జాంపుల్‌‌‌‌గా చెప్పవచ్చు.  కొన్ని సందర్భాల్లో ఇస్లాంను  ఎదిరించడం కోసం  శూద్ర కులాలన్నీ ఒకే తాటిపైకి తెచ్చి ఒకే కులంగా ఏర్పడ్డారు.  మహారాష్ట్రలోని మరాఠీలు దీనికి చక్కని నిదర్శనం.  లౌక్యంతో వ్యవహరించిన ద్విజ కులాలు,  సంధులు,  పన్నుల చెల్లింపులు, ఇస్లాం మత స్వీకరణ ద్వారా తమ వర్గాలను రక్షించుకోగా, రాజీపడని శూద్ర కులాలు త్యాగాలు,  పోరాటాల ద్వారా తమ  ప్రజలను,  సంస్కృతిని రక్షించుకున్నాయి. ఇదే టైంలో ఇస్లాం పాలనా మూలంగా  సరైన నిధులు లేక  దేవాలయాలు వెలసి పోవడంతో ఆదాయ రాబడి కోసం మెజారిటీ ప్రజానీకం గల  శూద్ర దేవాలయాలను బ్రాహ్మణులు కల్పిత కథల ఆధారంగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. త్రిమూర్తులలో ఒకరైన శివుని కేంద్రంగా చేసుకుని శూద్ర పోరాటయోధులను అతని కుమారులుగా,  ఆదిశక్తి అంశగా మూలవాసి మహిళా శాస్త్రవేత్తలను,  నాయకురాళ్లను  బ్రాహ్మణీకరణ  చేసి కల్పిత కథలతో విస్తృతమైన గ్లోబల్ ప్రచారం చేసి ఎన్నో ఏండ్లుగా చదువుకు దూరంగా ఉన్న శూద్ర కులాలను నమ్మించారు. వేమన, బ్రహ్మంగారు, బసవుడి లాంటి వారి  నాయకత్వంలో వచ్చిన ప్రతికూల ఉద్యమాలను తొక్కేశారు.  భావి ఆధ్యాత్మిక ఫాసిజంకు  బలమైన పునాదులు వేశారు.

ఆధ్యాత్మిక సాంస్కృతిక దోపిడీకి నిలువెత్తు నిదర్శనాలు..
దక్కన్​ జాతి గొర్రె బ్రీడును తయారు చేసి, వాటి ఉన్నితో గొంగళ్లను రూపొందించిన మేధావి మల్లన్న కాగా,  సౌడుస్ఫుటాల నుండి సబ్బు సృష్టించిన సైంటిస్ట్‌‌‌‌ మడేలు. అట్లే, పత్తి నుండి వస్త్రాన్ని నిర్మించిన ఘనుడు మార్కండేయుడు.  ఉక్కును ఉత్పత్తి చేసిన  మమ్మాయమ్మ,  చికెన్ పాక్స్​కు టీకాను రూపొందించిన పోచమ్మ,  చెరువు కట్టలను నిర్మించిన మైసమ్మ,  కోట దుర్గాలను కట్టిన దుర్గమ్మ,  కల్లుగీతను కనుగొన్న కాటమయ్య,  ప్రసూతి వైద్యం చేసిన బాలమ్మ,  ధర్మం కోసం పోరాడి అమరులైన సమ్మక్క-సారక్క, ఈదమ్మ,  గంగమ్మ,  వాసంబా లాంటి ఎంతో మంది శూద్రుల చరిత్రలు  ధ్వంసం చేసి  హైజాక్ చేశారు. బ్రాహ్మణుల దృష్టిలో క్షుద్ర దేవతలుగా,  ఇస్లాం, క్రిస్టియన్ల దృష్టిలో సైతానులుగా మలిచారు. నాలుగు వేదాలను ప్రామాణికంగా తీసుకునే బ్రాహ్మణులు వేదాలలో ఎక్కడా చోటులేని మూలవాసి మూర్తులకు ఆగమశాస్త్రం ప్రకారం సంస్కృతంలో ఎందుకు పూజలు చేయాలి? నిక్కచ్చిగా చెప్పాలంటే, వేదాలను ప్రమాణంగా తీసుకున్న  బ్రాహ్మణుల మతం వైదిక మతం అవుతుందే కానీ, హరప్పా నాగరీకులు  ప్రాచీనకాలంగా అనుసరిస్తున్న  సింధు(హిందు) మతం కానేకాదు. బ్రాహ్మణులు కొమురవెల్లి గుడిలోకి చొరబడ్డట్లు, హిందూ మతంలోకి మారు రూపంలో చొరబడ్డారు.  అందుకే వారు అసలైన హిందువులు కారు. వైదికులు లేదా కన్వర్టెడ్  హిందువులు.  ఎందుకంటే హిందూ మతం ఎల్లప్పుడూ ప్రకృతి, ఉత్పత్తి, సహనం, సహజీవనం, శాస్త్రీయతల చుట్టూ అల్లుకొని ఒక జీవన విధానంగా కొనసాగుతోంది. మత మార్పిడులకు, దైవ విద్వేషాలకు, సాంస్కృతిక ఆధిపత్యంకు దూరంగా ఉంటుంది.  దీనికి భిన్నంగా అబ్రమిక్ మతాలైన వేదిజం, ఇస్లాం,  క్రిస్టియానిటీలు మత ఆధిపత్యం, విస్తరణలే గమ్యంగా  పని చేస్తున్నాయి.  కనుక శూద్ర  భారతీయులు అబ్రహం, ఇబ్రహిమ్,  బ్రహ్మంలకు సమాన దూరంలో ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.  కొమరవెల్లిలో మల్లన్న మేలుకొలుపు ప్రార్థన ఒగ్గు, డోలు, నపిరే వాయిద్యాలతో హలెకన్నడ మిళిత తెలుగుభాషలో ఒగ్గు పూజారులు పూజలు చేస్తారు. దీనినే కురుమభాషగా పిలుస్తారు. బండారిని బొట్టుగా ధరించి, కనువిందు చేసే రంగుల పట్నాలను వేసి,  ఒగ్గు సచ్చాపు (శివశక్తుల) ఆటలతో రంగరంగ వైభవంగా పండుగలు చేసింది బహుజన ప్రజానీకమే.  తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని కాదని,  బండారికి బదులుగా విభూతితో తిలకం దిద్ది, మల్లన్నకే అర్థం కాని సంస్కృత భాషలో పూజలు చేయడం, పైగా ఒగ్గు పూజారులను దోపిడీ దారులుగా ముద్ర వేయడం, గ్రిల్లు బయటి భాగంలో ఉండి పూజలు చేయమనడం  చాలా దారుణమైన విషయాలు. ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక దోపిడీకి నిలువెత్తు నిదర్శనాలు.