- కామారెడ్డిలో గెలుపుతో చిగురించిన ఆశలు
- ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి గణనీయంగా పెరిగిన ఓట్లు
- జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆశావహులు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడంతో పాటు, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఓటు బ్యాంకు పెరగడంతో జహీరాబాద్ ఎంపీ టికెట్‌కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ గణనీయమైన ఓట్లు వచ్చాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేయాలని కీలక నేతలు భావిస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిని ఓడించి అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి తోడు ప్రధాని మోదీ చరిష్మా, యూత్‌లో బీజేపీకి ఉన్న క్రేజ్, అయోధ్యలో రామమందిర ప్రారంభం తదితర అంశాలు కలిసి వస్తాయని ఆశావహులు భావిస్తున్నారు. దీంతో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగింది. వీరంతా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అధిష్టానం మాత్రం ఇంకా ఏ నేతకు హామీ ఇవ్వలేదు. మరో వైపు టికెట్ ఆశిస్తున్న వారు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ద్వితీయ శ్రేణి లీడర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
టికెట్ ఆశిస్తున్న వారిలో..
జహీరాబాద్ టికెట్ఆశిస్తున్న వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన నేతలతో పాటు, ఉమ్మడి మెదక్‌జిల్లాకు చెందిన లీడర్లు కూడా ఉన్నారు. కొందరు స్టేట్ లీడర్లు కూడా ఈ స్థానంపై గురిపెట్టారు. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిన బాణాల లక్ష్మారెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉప్పునూతుల మురళీధర్‌గౌడ్, తాడ్వాయి మండలం దేవాయిపల్లి వాసి, సెంటిస్ట్పైడి ఎల్లారెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బోధన్ టికెట్ఆశించిన మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, అడ్వకేట్ రచనా రెడ్డి, జైపాల్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, ఆలే భాస్కర్, బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప టికెట్ రేసులో ఉన్నారు.
వీరంతా రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్‌లతో పాటు, ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసిన సేవలు, ఇతర కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో వారికున్న అనుబంధాలను వివరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పార్లమెంట్ఎన్నికల సన్నద్ధతపై మీటింగ్నిర్వహించారు. కేంద్రమంత్రి అమిత్‌షా ఈ సమావేశానికి అటెండయ్యారు. ఆయా పార్లమెంట్ స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్న వారి నుంచి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని స్టేట్ ముఖ్య నేతలకు షా సూచించారు. ఈ లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయోనని ఆశావహులు ఉత్కంఠతో ఉన్నారు
పెరిగిన ఓట్లతో..
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నాలుగు కామారెడ్డి జిల్లాలో, మూడు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి 1,72,766 ఓట్లు వచ్చాయి. 2018లో 98,514 ఓట్లు మాత్రమే పడ్డాయి.
గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 74,252 ఓట్లు పెరిగాయి. కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఈ సారి 1,45,774 ఓట్లు వచ్చాయి. బీజేపీకి కామారెడ్డిలో 66,652, ఎల్లారెడ్డిలో 27 వేలు, బాన్సువాడలో 23,685 , జుక్కల్‌లో 28,433 ఓట్లు పడ్డాయి. 2018లో జిల్లాలోని ఈ నాలుగు స్థానాల్లో 43,596 ఓట్లు మాత్రమే బీజేపీ సాధించింది. జిల్లాలో ఈసారి బీజేపీకి 1,02,178 ఓట్లు అధికంగా పోలయ్యాయి.