
- 100 మార్కుల పేపర్లో 39 క్వశ్చన్లు రాంగ్
- వాటిలో 25 క్వశ్చన్లకు మార్కులు..
- మిగిలిన వాటిని పట్టించుకోని సెట్ ఆఫీసర్లు
- భారీగా మార్కులు కలవడంతో మారిన ర్యాంకులు
- రీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్న అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల అర్హత కోసం రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) హిస్టరీ పరీక్ష నిర్వహణపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకే పేపర్లో 40 క్వశ్చన్లు తప్పుగా వచ్చాయి. దీంట్లో ఓ 26 ప్రశ్నలకు మార్కులు కలిపిన అధికారులు.. మరో 14 క్వశ్చన్లను అలాగే వదిలేశారు. ఏకంగా ఒకే పేపర్లో 52 మార్కులు కలవడంతో.. అభ్యర్థుల ర్యాంకులన్నీ తారుమరయ్యాయి.
ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటనపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) ఆన్లైన్ పరీక్షలను నిరుడు సెప్టెంబర్లో ఓయూ నిర్వహించింది. మొత్తం 29 సబ్జెక్టులకు ఈ ఎగ్జామ్ నిర్వహించగా, దీంట్లో హిస్టరీ పరీక్షలో తప్పులు బయటపడ్డాయి.
అధికారులు ప్రకటించిన దాని ప్రకారమే పేపర్– 1 జనరల్ స్టడీస్ లో 45వ క్వశ్చన్ తప్పుగా వచ్చింది. పేపర్–2 హిస్టరీలో వంద ప్రశ్నల్లో ఏకంగా 39 ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. ప్రతి దానికి ‘‘కింది ప్రతిపాదనలను పరిగణించండి..?”అంటూ క్వశ్చన్ వచ్చింది.
అయితే, దీనిలో ఆబ్జెక్షన్లను తీసుకున్న అధికారులు.. మొత్తం 40 క్వశ్చన్లూ ఒకే రకంగా వచ్చినట్టు గుర్తించారు. కానీ పేపర్– 1లో ఒకటి, పేపర్– 2లో 25 క్వశ్చన్లు తప్పుగా వచ్చాయని 52 మార్కులు కలిపారు. ఈ తప్పును అభ్యర్థులు గుర్తించి చెప్పేదాకా అధికారులు గుర్తించలేదు.
అధికారుల నిర్లక్ష్యంపై అభ్యర్థులు యూజీసీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరికీ52 మార్కులు యాడ్ కావడంతో చాలామంది మార్కుల్లో తేడాలొచ్చాయని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు.
టెక్నికల్ సమస్యతోనే..
టెక్నికల్ సమస్యలతో కొన్ని క్వశ్చన్లు ఇన్ కంప్లీట్ గా వచ్చాయి. దీంతో ఎక్స్ పర్ట్ కమిటీ సూచనల మేరకు, పరీక్షకు అటెండ్ అయిన అభ్యర్థులందరికీ ఆయా క్వశ్చన్లకు మార్కులు కలిపాం.
కొందరు అభ్యర్థులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే మార్కులు కలిపాం. పేపర్ రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించే ఆలోచన లేదు. నరేశ్ రెడ్డి, టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ