రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం: జగన్

తిరుపతి: రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మరోసారి ఆరోపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో తాజ్ హోటల్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ జరగలేదన్నారు. ప్రత్యేకహోదా హామీని కేంద్రం నెరవేర్చలేదని గుర్తు చేశారు.

ఆర్ధికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట కల్పించాలని కోరారు. రాష్ట్రం విడిపోయి ఏళ్లు గడిచినా హామీలు ఇంకా అమలు కాలేదన్నారు వైఎస్ జగన్. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని కోరారు.రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలో పరిష్కారం చూపాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచితో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు జగన్. సమావేశంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ పటేల్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, అండమాన్ నికోబార్ ఎల్జీ దేవేంద్రకుమార్ జోషి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.