తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో మరో రెండు, మూడు గంటల్లో.. దంచికొట్టనున్న వాన

తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో మరో రెండు, మూడు గంటల్లో.. దంచికొట్టనున్న వాన

హైదరాబాద్: తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన చేసింది. వచ్చే రెండు, మూడు గంటల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో రానున్న 2–3 గంటల్లో వాతావరణం చల్లబడుతుందని.. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్లో కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం చల్లబడుతుందని, రాత్రి సమయంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి.

ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాలకు వాతావరన శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వడగండ్లు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆ తర్వాత శుక్రవారం, శనివారం రెండు రోజులు కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్​ఇష్యూ చేసింది. హైదరాబాద్లోనూ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు టెంపరేచర్లు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో కొద్ది రోజులపాటు ఎండలు తగ్గనున్నాయి. అటు చత్తీస్​గఢ్, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం, దానికి ఆనుకుని ద్రోణి.. ఇటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు మీదుగా మరో ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వడగండ్లతో కూడిన వర్షాలు పడనున్నాయి.