తీవ్రంగా దెబ్బతిన్న కాకతీయ కెనాల్

తీవ్రంగా దెబ్బతిన్న కాకతీయ కెనాల్
  •     పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్న కాకతీయ కెనాల్
  •     సిటీ పరిధిలో కొట్టుకుపోయిన హైడెన్సిటీ పాలిథిన్‍ షీట్లు
  •     రిపేర్లు చేయకుండా నీళ్లొదిలితే నష్టమే 
  •     వరంగల్​ సిటీలో పలు కాలనీలకు పొంచి ఉన్న ముప్పు

వరంగల్‍, వెలుగు: ఎస్సారెస్పీ కెనాల్‍ కట్టల వెంట ప్రమాదం పొంచి ఉంది. కరీంనగర్‍ ఎల్‍ఎండీ నుంచి వరంగల్‍ వైపు గోదావరి నీటిని విడుదల చేసే క్రమంలో కెనాల్‍ రిపేర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుచేసినా.. పనుల్లో క్వాలిటీ పాటించలేదు. దీంతో చాలాచోట్ల సిమెంట్‍ లైనింగ్ దెబ్బతింది. సిటీ పరిధిలో కాలువ మరింత స్ట్రాంగ్‍ గా ఉండడానికి, లీకేజీలు అరికట్టడానికి వేసిన హైడెన్సిటీ పాలిథిన్‍ కవర్లయితే ఏనాడో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో చివరి ఆయకట్టు..రెండు పంటలకు గోదావరి నీటిని అందించే క్రమంలో  5 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని సర్కారు విడుదల చేస్తోంది. దీంతో లైనింగ్‍ దెబ్బతిన్న చోట్ల బుంగలు పడే ప్రమాదం కనిపిస్తోంది. నీటిని వదలడానికి ముందస్తుగా కాలువ లైనింగ్‍ను పరిశీలించాల్సిన అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు.  

రూ.150 కోట్ల ఖర్చు 

40 ఏండ్ల క్రితం నిర్మించిన శ్రీరాంసాగర్‍ ప్రాజెక్ట్​ ను 8 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించినట్లు నాటి పాలకులు చెప్పారు. అప్పటి నీటి వనరుల దృష్ట్యా 3–4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేవారు. మధ్యలో ప్రవాహం లేక చాలాచోట్ల కాలువలు దెబ్బతిన్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం నీటిని కరీంనగర్‍ నుంచి వరంగల్‍ మీదుగా నల్గొండ జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించాలని ప్రస్తుత సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్సారెస్పీని బలపరిచి స్టేజీ 1, స్టేజీ 2 ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలనుకుంది. 2017–18లో ఎల్‍ఎండీ నుంచి వరంగల్‍ వరకు కాలువల లైనింగ్‍, వెడల్పు, ఎత్తు పెంచే పనుల కోసం రూ.150 కోట్లు ఖర్చు చేసింది. 

సిటీ పరిధిలో హైడెన్సిటీ పాలిథిన్‍ షీట్లు 

ఎస్సారెస్పీ కెనాల్‍ అభివృద్ధి పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చాలాచోట్ల కాలువకు మరీ దగ్గరగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. కాలువ లోపలి భాగం వెడల్పు చేసి ఇరువైపులా కొత్తగా సిమెంట్‍ లైనింగ్‍ వేసింది. కట్ట ఎత్తు, వెడల్పు పెంచింది. భవిష్యత్తులో కెనాల్‍ పనులు చేయడానికి రెండు వైపులా వెళ్లేందుకు, అనుకూలంగా ఉన్నచోట్ల పేదల ఇండ్ల జోలికి పోకుండా పనులు చేపట్టింది. హన్మకొండ, వరంగల్‍ సిటీ పరిధిలో కెనాల్‍ వెంట 7–8 కిలోమీటర్ల దూరం వందలాది కాలనీలు, వేలాది ఇండ్లున్న నేపథ్యంలో ఎంత నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేలా కొత్త టెక్నాలజీ ఉపయోగించింది. ఆస్ట్రియా నుంచి మందంగా ఉండే రూ.5 కోట్ల 26 లక్షల విలువ చేసే హైడెన్సిటీ పాలిథిన్‍ షీట్లను తెప్పిచ్చింది. విదేశాలకు తోడు మన దేశంలోని మధ్యప్రదేశ్‍, ఢిల్లీ ప్రాంతాల్లో ఇవి సక్సెస్‍ అయ్యాయని చెప్పింది. కెనాల్‍ లోపలి భాగం లో మొత్తం ఈ కవర్లను అంటించడం ద్వారా వాటర్‍ ఫ్లో ను ఈజీగా తట్టుకోవడమే కాకుండా, ఎక్కడ బుంగలు పడే అవకాశం ఉండదని ప్రకటించింది. నీటి లీకేజీ అరికట్టడానికి తోడు చెట్లు మొలిచి.. కట్టలు దెబ్బతినే అస్కారం ఉండదని తెలిపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే హన్మకొండ– గుండ్లసింగారం నుంచి వరంగల్‍ ఆటోనగర్‍ వరకు వీటిని పరిచారు. 

ప్రమాదకరంగా సైడ్‍ లైనింగ్‍  

150 కోట్ల  రూపాయలతో చేసిన ఎస్సారెస్పీ కెనాల్‍ పనులు 20 ఏండ్లు చెక్కుచెదరకుండా ఉండాల్సింది. అయితే  రెండు మూడేండ్లకే సిటీ పరిధితో పాటు ఇతరచోట్ల సిమెంట్‍ లైనింగ్‍ పగిలి మట్టి కట్ట కనపడుతోంది. 8 సంవత్సరాల కింద రెడ్డికాలనీ–పెద్దమ్మగడ్డ మధ్య కెనాల్‍ కట్టకు బుంగ పడింది. పోయినేడాది వందల కోట్ల పనులు చేశాక కూడా హన్మకొండ –గుండ్లసింగారం –గణేశ్‍నగర్‍ వద్ద కట్టకు చిన్నపాటి బుంగపడగా చుట్టుపక్క కాలనీలు నీటమునిగాయి. 
ఈ రెండు ఘటనలు జరిగిన టైంలో పక్కనే సిటీ నుంచి మురుగునీరు వెళ్లే పెద్ద కాలువ ఉండడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో హైడెన్సిటీ కవర్లు కొట్టుకుపోడానికి తోడు సిమెంట్‍ లైనింగ్‍ దెబ్బతినడంతో ఎస్సారెస్పీ కెనాల్‍ కట్టలు ప్రమాదకరంగా కనపడుతున్నాయి.  

షీట్లు కొట్టుకుపోయినయ్‍ 

హరీశ్​రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న 2018లో వేసిన హైడెన్సిటీ కవర్లు 100 ఏండ్ల లైఫ్​ ఉంటుందని కనీసం 10 ఏండ్ల వరకు 'కట్‍ చేస్తే కట్టవదు.. మంటపెట్టి కాల్చితే కాలదని' అధికారులు చెప్పారు. అయితే..గుండ్లసింగారం నుంచి ఆటోనగర్‍ వరకు వేసిన బ్లాక్‍ కవర్లు చాలాచోట్ల కొట్టుకుపోయాయి. నీటి ప్రవాహానికి చిందరవందరగా మారాయి. పిల్లలు ప్రమాదవశాత్తు కెనాల్స్​లో పడి చనిపోతే వారి శవాలు ఈ షీట్ల కింద తట్టుకుని రోజుల తరబడి దొరకడంలేదు. ఇదిలా ఉంటే నాలుగేండ్ల క్రితం తీసుకొచ్చిన కోట్లాది రూపాయల విలువ చేసే వేలాది మీటర్ల షీట్లను అధికారులు పూర్తిగా వాడనేలేదు. హన్మకొండ యాదవనగర్‍ ప్రాంతంలో పక్కన 
పడేశారు.   

చిన్న బుంగకే ఇంట్లకు నీళ్లొచ్చినయ్‍

కాకతీయ పెద్ద కెనాల్‍కు రెండు వైపులా చాలాచోట్ల సిమెంట్‍ లైనింగ్‍ దెబ్బతిని మట్టి తేలింది. పోయినేడాది గణేశ్​నగర్​వద్ద చిన్న బుంగపడితే మా ఇందిరమ్మ కాలనీతో పాటు గుండ్లసింగారం, సారా ప్లాంట్‍ ఏరియాల్లోని మొత్తం ఇండ్లల్లోకి నీళ్లొచ్చినయ్‍. అప్పటి నుంచి కెనాల్​లో ఎక్కువ నీళ్లు వదిలితే భయమేస్తాంది. కట్ట తెగితే చుట్టూ రెండు కిలోమీటర్ల దూరం ఇండ్లు మునుగుడు ఖాయం. కట్టను స్ట్రాంగ్‍ చేస్తే మంచిగుంటది. నీళ్లు వదలనప్పుడే వాటిని రిపేర్‍ చేయాలె.
- ఎ.సతీశ్, ఇందిరమ్మ కాలనీ

జాగ్రత్తలు తీసుకుంటున్నం

గతంలో పోలిస్తే ఎస్సారెస్పీ కెనాల్​లో వాటర్‍ ఎక్కువ వదులుతున్నది నిజమే. సిటీలో ఎక్కువ ఇండ్లుండే గుండ్లసింగారం నుంచి ఆటోనగర్‍ వరకు వేసిన కవర్లు నీటి ప్రవాహానికి పోయాయి. అప్పట్లో దానిని ఒక ఎక్స్​పర్​మెంట్​గా వేశారు. గతేడాది గణేశ్‍నగర్‍ వద్ద చిన్నపాటి బుంగకే కాలనీల్లో నీరు చేరడంతో మా పరిధిలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కట్ట సైడ్‍ లైన్లు దెబ్బతింటే నష్టతీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సమస్యలుంటే ఉన్నాతాధికారులు, కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకెళ్తున్నాం. 
- రాజు, ఇరిగేషన్‍ డీఈ, హన్మకొండ