రామగిరి, వెలుగు : సింగరేణి ఆర్జీ 3 ఏరియా పరిధిలోని సెంటినరీ కాలనీలో ఉన్న కార్మికుల క్వార్టర్స్‌కు మంచి నీటి సరఫరాలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. నెల రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి సరఫరా చేస్తున్న నీరు తాగడానికి పనికి రాకపోగా, కనీసం ఇంటి అవసరాలను తీర్చుకునేందుకు కూడా ఉపయోగపడేలా లేదని మండిపడ్డారు. క్వార్టర్స్‌కు వస్తున్న నీటిలో ఓసీ వన్‌మైన్‌కు సంబంధించిన కెమికల్స్ కలుస్తున్నాయని ఆరోపించారు.
ఆర్జీ 3 జనరల్ మేనేజర్ సాగర్ సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ ఏరియా సెక్రటరీ దొమ్మాటి కొమురయ్య కోరారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే కార్మికుల కుటుంబాలతో కలిసి జీఎం ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.