- దగ్గరుండి విడుదల చేస్తున్న ఆఫీసర్లు
- చర్మ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
- కలుషిత నీటిని తాగలేకపోతున్న పశువులు
- 500 ఎకరాల పంట సాగు ప్రశ్నార్థకం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ఖాసీంపల్లి పెద్ద చెరువు ఒకప్పుడు తెల్లటి నీటితో కళకళలాడుతుండేది. పిల్లలు ఈత కొడుతూ, మత్స్యకారులు చేపలు పడుతూ కనిపించేవారు. ఈ చెరువు పశుపక్షాదుల దాహార్తిని తీర్చేది. 500 ఎకరాలకు సాగు నీరు అందించేది. స్థానికులు బట్టలు పిండుకోవాలన్నా.. ఇంటి అవసరాలకు నీరు కావాలన్నా ఈ చెరువే పెద్ద దిక్కు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఆఫీసర్ల తీరుతో మంచి నీటి చెరువు కాస్త మురికి కూపంలా మారింది. దగ్గరికి వెళ్తేనే ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి. మత్య్సకారులకు జీవనోపాధి దూరం కాగా.. పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
చెరువులోకే మురికి కాలువలు..
భూపాలపల్లి మున్సిపాలిటీలో దాదాపు లక్ష జనాభా ఉంటుంది. జిల్లా కేంద్రం అయ్యాక అభివృద్ధి చెందుతోంది. పట్టణ పరిధిలో ఉన్న మురుగు కాలువలను ఖాసీంపేట చెరువుకే మళ్లిస్తున్నారు. దాదాపు 75శాతం మురుగు నీరు ఈ చెరువులోనే వచ్చి చేరుతోంది. కలుషిత నీటిని అరికట్టాల్సిన ఆఫీసర్లు.. కాలువలను తవ్వి, నేరుగా చెరువులోకే వదులుతున్నారు. దీంతో స్వచ్ఛంగా ఉండాల్సిన నీళ్లు రంగు మారాయి. దగ్గరికి వెళ్తేనే కంపు కొడుతోంది.
ఒక్క ప్లాంట్ లేదు..
మురుగు నీటిని శుద్ధి చేసేందుకు భూపాలపల్లిలో ఒక్క సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కూడా లేదు. మున్సిపాలిటీగా మారాక అలాంటి ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు. పట్టణంలోని కారల్‌మార్క్స్ కాలనీ, మెయిన్ రోడ్, హనుమాన్ నగర్, రెడ్డి కాలనీ, ఎల్‌బీ నగర్, సుభాష్‌కాలనీ, కాకతీయ కాలనీలకు చెందిన మురుకి నీరంతా నిత్యం పెద్ద చెరువులోనే కలుస్తోంది. ఆఫీసర్లు మెయిన్ రోడ్ వెంట తవ్విన ప్రధాన కాలువను సైతం నేరుగా చెరువులోకే కనెక్షన్ ఇచ్చారు.
కలవరపెడుతున్న చర్మ వ్యాధులు..
పెద్ద చెరువు నీరు తాకిన పిల్లలకు చర్మ వ్యాధులు వస్తున్నాయి. సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి, ఖాసీంపల్లి, జంగేడు తదితర గ్రామాలకు చెందిన పది మందికిపైగా పిల్లలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. గత ఐదారు నెలలుగా చికిత్స చేయిస్తున్నా వ్యాధి తగ్గడం లేదు. వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ఫలితం లేదు. స్కూళ్లలో తోటి పిల్లలు హేళన చేస్తుండడంతో బడి కూడా మానేశారు. మరోవైపు చెరువులోని చేపలు తినడానికి ప్రజలు జంకుతున్నారు. దీంతో మత్స్యకారులకు గిరాకీ లేకుండా పోయింది. చెరువులోకి దిగి చేపలు పడుతున్న మత్స్యకారులకు సైతం వ్యాధులు ప్రబలుతున్నాయి. వ్యాధుల విషయాన్ని డాక్టర్లు సైతం ధ్రువీకరిస్తున్నా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు.
పిల్లలకు చర్మవ్యాధులొస్తున్నాయి..!
పెద్ద చెరువు కలుషితం కావడం వల్ల పిల్లలకు చర్మవ్యాధులు వస్తున్నాయి. ఇప్పటికే మూడు, నాలుగు గ్రామాలకు చెందిన పది, పదిహేను మంది పిల్లలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్ చేసినా తగ్గడం లేదు. పిల్లల తల్లితండ్రులు డాక్టర్ ఫీజులు, మందుల కోసం వేలల్లో ఖర్చు పెడుతున్నారు. ‒ సెగ్గం శ్యాం, ఆర్‌ఎంపీ డాక్టర్, గడ్డిగానిపల్లి
ప్రపోజల్స్ పంపించాం!
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మురికినీళ్లను శుభ్రం చేయడానికి 3 సీవెజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్(ఎస్‌టీపీ)లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే రూ.3 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం. నిధులు మంజూరు కాగానే 5 ఇంక్లైన్, జంగేడు, హనుమాన్ టెంపుల్ వద్ద ఎస్‌టీపీలను ఏర్పాటు చేసి మురికినీళ్లను శుభ్రం చేసి పంపిస్తాం. ‒అవినాశ్, ఇన్చార్జి కమిషనర్, భూపాలపల్లి మున్సిపాలిటీ