- వారి హక్కుల అమలుకు కృషి చేయాలి
- జస్టిస్ సుజోయ్ పాల్
హైదరాబాద్ సిటీ, వెలుగు : సెక్స్ వర్కర్లను అందరిలాగే సమాన గౌరవంతో చూడాలని, వారి హక్కుల సాధనకు అందరూ కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు జడ్జి, టీఎస్ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. సమాజంలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన వారి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు.
తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ), సాతి (ఎస్ఏఏటీహెచ్ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సెక్స్ వర్కర్ల హక్కులపై రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని జస్టిస్ సుజోయ్‌పాల్ ప్రారంభింఛారు.
రాజ్యాంగ హక్కులకు వాళ్లు అర్హులే : పంచాక్షరి
టీఎస్ఎల్ఎస్ఏ మెంబర్, సెక్రటరి సీహెచ్ పంచాక్షరి మాట్లాడుతూ.. పౌరులుగా అన్ని రాజ్యాంగ హక్కులకు సెక్స్ వర్కర్లు అర్హులని పేర్కొన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో రిజిస్టర్ చేసుకోవాలని, సివిల్ సప్లై శాఖ నుంచి నెలవారీ రేషన్‌లను పొందేందుకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలకు ఆధార్ వివరాలను అందించాలని సెక్స్ వర్కర్లకు ఆయన సూచించారు.
అనంతరం ట్రాన్స్ జెండర్స్, హిజ్రా హక్కుల యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన మాట్లాడారు. ట్రాఫికింగ్, వాలంటీర్‌గా సెక్స్‌వర్క్ చేయడం వేర్వేరు అని, పోలీసులు రైడ్ చేసిన సమయంలో బాధితుల ఫొటోలు, వీడియోలు బయటపెట్టకూడదని సూచించారు.