అయినోళ్ల చేతిలోనే  అఘాయిత్యాలు

అయినోళ్ల చేతిలోనే  అఘాయిత్యాలు
  • చిన్న పిల్లలపై పెరుగుతున్న లైంగికదాడి కేసులు 
  • ఇంటా.. బయటా పిల్లలకు తప్పని వేధింపులు
  • హైదరాబాద్ జిల్లాలో ఎక్కువవుతున్న పోక్సో కేసులు
  • గత ఆరునెల్లలోనే 219  నమోదు

హైదరాబాద్, వెలుగు : పిల్లలకు మంచి.. చెడు చెప్పాల్సింది పోయి.. అయినవాళ్లే వావి వరసలు మరిచి వికృతంగా ప్రవర్తిస్తున్నారు . వీరిలో కన్నవారు, బంధువులే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.  ఇటీవల జరిగిన ఘటనలు చూస్తే కలవరానికి గురి చేస్తున్నాయి. తండ్రి, బాబాయి, మామ, అన్న, తాత.. ఇలా సొంతవారే కామాంధులుగా మారుతున్నారు. పసి హృదయాలను గాయపరుస్తున్నారు.

ఆపై ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడంలేదు. ఇలా ఇంటా.. బయటా పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పోక్సో చట్టాల ద్వారా కఠినంగా శిక్షిస్తున్నా కూడా మార్పు రావడంలేదు.  హైదరాబాద్​జిల్లాలో పోక్సో కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత ఆరు నెలల్లోనే 219 పోక్సో కేసులు డిస్ట్రిక్ట్ ఉమెన్​అండ్​చైల్డ్​వెల్ఫేర్, జిల్లా అట్రాసిటీస్​డిపార్ట్​మెంట్ కంపెన్సేషన్ కోసం వచ్చాయి. గతేడాది ఇవి 273గా ఉండగా.. ఈ ఏడాది ఆరు నెలల్లోనే వచ్చిన కేసులు తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. అయితే, కంపెన్సేషన్​కోసం వచ్చే కేసులే ఈస్థాయిలో ఉంటే.. జిల్లాలో నమోదయ్యే మొత్తం కేసులు మూడు, నాలుగు రేట్లు అధికంగా ఉన్నా ఆశ్చర్యం లేదు.  

మూడు టచ్​ గురించి చెప్పాలి 

పిల్లలకు ముఖ్యంగా మూడు టచ్ ల గురించి చెప్పాలి. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ తో పాటు కన్ఫ్యూజింగ్​టచ్ గురించి కూడా తెలియజెప్పాలి.  ఎవరైనా పిల్లల్ని తాకినప్పుడు కొన్నిసార్లు గుడ్ టచ్ లాగే ఉంటుంది. దానితో మొదలై.. కన్ఫ్యూజన్​టచ్​గా మారుతుంది. ముందుగా పిల్లల రియాక్షన్​ఎలా ఉంటుందో చూసి అనంతరం బ్యాడ్​టచ్​లోకి వెళ్తుంటారు.

అందుకే మూడు టచ్ లపైనా అవగాహన అవసరం . టీచర్లు, మహిళా పోలీసుల ద్వారా ప్రతి స్కూల్​లో అవేర్​నెస్​ ప్రోగ్రామ్ లు నిర్వహించాలి. ఇబ్బందులకు గురైతే.. పేరెంట్స్ చెప్పేందుకు సిద్ధంగా ఉండేలా పిల్లలను ప్రిపేర్​చేయాలి. పేరెంట్స్​కూడా ఇలాంటివి జరిగితే.. ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లయింట్ చేయాలి.   

వేధింపులపై పిల్లలు చెబితే పేరెంట్స్​ కోపం చేయొద్దు  

వేధింపులపై పిల్లలు చెప్పగానే చాలా మంది పేరెంట్స్​ కోపం ప్రదర్శిస్తారు. అలా చేయకూడదు. దీంతో పిల్లలు చెప్పడానికి జంకుతారు. ఏదైనా గాయం అయినప్పుడు మాత్రమే  పేరెంట్స్ తెలుస్తుంది. చైల్డ్​అబ్యూస్​ఆడ, మగ పిల్లల్లోనూ జరుగుతుంది. గుడ్​టచ్..​ బ్యాడ్​టచ్​ గురించి పిల్లలకు వివరించి చెప్పాలి.  ప్రవర్తనలో మార్పులు గమనిస్తే.. ముందుగా కోపం చేయకుండా ఆరా తీయాలి. చిన్న వయసులోనే లైంగిక దాడికి గురైన పిల్లలు మెంటల్​గా చాలా డిస్ట్రర్బ్​అవుతారు.

తరచూ భయపడటం, నిద్రలేకపోవడం, స్కూల్​కు వెళ్లకపోడం, పక్క తడిపేయడం వంటివి చేస్తుంటారు. ఎవరిని చూసినా భయానికి లోనవుతుంటారు. 12 ఏండ్ల పై బడినవారు డిప్రెషన్​కు గురవడం, కారణం లేకుండా కోపంగా ఉండటం, ఓసీడీ, సూసైడల్​థాట్స్​ వస్తుంటాయి. వారి వయసును బట్టి కౌన్సిలింగ్​ద్వారా సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.

- డాక్టర్​రిషీ, సైకియాట్రిస్ట్​, నిలోఫర్​ హాస్పిటల్

“మహబూబాబాద్ కు చెందిన బానోత్​ నరేశ్​కొంతకాలం కిందట బతుకుదెరువుకు కుటుంబంతో వచ్చి మియాపూర్​లో ఉంటున్నాడు. మొబైల్​లో పోర్న్​వీడియోలు చూస్తూ నరేశ్​చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తన కోరిక తీర్చాలంటూ కన్న కూతురి(12)పై ఒత్తిడి చేశాడు. ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి   తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు.

బాలిక గట్టిగా అరవడంతో కోపంతో జుట్టుపట్టుకొని నేలకేసి కొట్టి చంపాడు. అనంతరం ఏమీ తెలియనట్లు భార్యతో కలిసి కూతురు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు తండ్రిని తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇది గత జూన్ 7న జరిగిన ఘటన.’’

“ సిటీకి చెందిన ఓ మహిళ భర్త చనిపోగా.. కుటుంబానికి అన్నీ తానై నెట్టుకొస్తుంది. కొద్దిరోజులుగా15 ఏండ్ల తన కూతురు ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. ఎప్పుడూ ఒంటరిగా ఉండడం, స్కూల్​కు వెళ్లకపోవడం చేసేది. ఒకరోజు బాలిక తన చేయిని కత్తితో కోసుకుంది. తల్లి నిలదీయడంతో  కూతురు ఫ్రెండ్​వాళ్ల తండ్రి ఐదేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడని చెప్పింది.

మొబైల్​లో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్​చేస్తున్నాడని పేర్కొంది.  దీంతో ఇటీవల బాలిక తల్లి.. కూతురిని డాక్టర్లకు చూపించింది.  చైల్డ్​వెల్ఫేర్ అధికారులను సంప్రదించి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.’’