
పద్మారావునగర్/ హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఎంఎంటీఎస్‌లో తనపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించగా, రైలు నుంచి దూకేశానని ఓ యువతి చెప్పినదంతా కట్టుకథేనా..? ఆ యువతిపై లైంగిక దాడి జరిగినట్టు ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకకపోవడంతో ఆమె చెప్తున్న మాటలు నిజం కాదని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్వెళ్తున్న ఎంఎంటీఎస్‌లో గత నెల 22న ఓ వ్యక్తి తనపై లైంగికదాడికి యత్నించగా, రైలు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నానని ఓ యువతి వెల్లడించడంతో ఈ విషయం సంచలనంగా మారింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జ్ కూడా అయింది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైల్వే ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలోని టీమ్ నెల రోజులుగా ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా పరిశీలించారు. సుమారు 250 సీసీ కెమెరాలను జల్లెడ పట్టి, 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. అయితే, ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకకపోవడంతో బాధితురాలి వాంగ్మూలంపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో లీగల్ఒపీనియన్ తీసుకుని, కేసు క్లోజ్చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు.
అయితే, బాధితురాలు రీల్స్చేస్తూ రైలు నుంచి పడిపోయిందని.. తల్లిదండ్రులు, బంధువులు తిడతారనే భయంతో లైంగికదాడి అని కట్టుకథ అల్లిందని సోషల్‌మీడియాతో పాటు కొన్ని చానల్స్‌లో వార్తలు వచ్చాయి. దీంతో కర్నూలులో ఉంటున్న సదరు బాధితురాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఓ వ్యక్తి తనపై లైంగికదాడికి యత్నించడం వల్లే రైలు నుంచి దూకానని.. పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది.
బాధితురాలు ఏం చెప్పిందంటే..
ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన బాధిత యువతి(23) మేడ్చల్‌లోని విమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పని చేసేది. గత నెల 22న సాయంత్రం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్‌ఫోన్ రిపేరింగ్షాపులో డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్రిపేర్చేయించుకుని రాత్రి 7:15 గంటలకు ప్లాట్‌ఫాం నంబర్10లో తెల్లాపూర్--–మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలెక్కింది.
ఆ టైంలో యువతితో పాటు మరో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్‌లో వారు ఇద్దరూ దిగిపోయారు. తర్వాత యువతి ఒక్కతే బోగీలో ఉంది. 8:15 గంటలకు 25 ఏండ్ల యువకుడు.. ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. దాంతో యువతి రైలులోంచి కిందకు దూకేసింది. ఈ ప్లేస్గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్స్టేషన్కు అర కిలోమీటర్దూరంలో ఉంటుంది.
యువతి చేతి మణికట్టు విరిగిపోయింది. ముఖం, గదవ, శరీరం నుంచి రక్తం పోతుండడంతో అటువైపు వెళ్తున్న వాళ్లు గమనించి 108 అంబులెన్స్‌కు కాల్చేశారు. ముందు గాంధీ దవఖానాకు తరలించారు. తర్వాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ఆదేశాలతో ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
ఎవరి ఫొటో చూపించినా..
దర్యాప్తులో భాగంగా 120 మంది అనుమానితులను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. అయితే, ఎవరూ బాధితురాలు చెప్పిన రూట్లో లేనట్టుగా గుర్తించారు. అనుమానితుల్లోంచి నలుగురు ఫొటోలను ఎంచుకుని, ఒక రోజు ఒకరిది, మరో రోజు మరొకరి ఫొటోను బాధితురాలికి చూపించగా.. ఏ ఫొటో చూపించినా.. అతడే తనపై దాడి చేశాడని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అన్ని టెక్నికల్ఎవిడెన్స్పరిశీలించిన తర్వాత ఎక్కడా ఆమె చెప్తున్నట్టు బోగీలో మగవారు ఎక్కినట్టు ఆధారాలు దొరకలేదు. దీంతో బాధితురాలు నిజం చెప్పలేదని నిర్ధారణకు వచ్చారు.
రాజకీయ పార్టీల సైలెన్స్
ఈ ఘటన రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్తో పాటు కొంతమంది ఘటనను నిరసిస్తూ రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇతర బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించారు. న్యాయం చేసేంతవరకు పోరాడతామని హామీ ఇచ్చారు. చివరకు ఘటన అంతా ఉత్తదేనని రైల్వే పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఇప్పుడు సైలెన్స్అయిపోయారు.
దాడి నిజమేనంటున్న బాధితురాలు
దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అనంతపురం వెళ్లిన బాధితురాలి గురించి ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం రీల్స్చేస్తూ కింద పడిపోయిందని వార్తలు రావడంతో స్పందించి మాట్లాడింది. తాను రైల్వే పోలీసులకు చెప్పింది నిజమేనని స్పష్టం చేసింది. ఆ రోజు ఓ వ్యక్తి తన పైకి వచ్చాడని, అతడిని నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చింది. రైలు దిగిన తర్వాత అతడితో వస్తానని అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసినా వీలు కాలేదని చెప్పింది. తప్పని పరిస్థితుల్లో తనను ఏం చేస్తాడోనని భయపడి రైలు నుంచి దూకినట్టు తెలిపింది.
250 సీసీ కెమెరాలు జల్లెడ పట్టినా..
గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) ఎస్పీ చందన దీప్తి బాధితురాలిని పరామర్శించి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి నాలుగు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. రెండు బృందాలు సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన పని పెట్టుకుంటే మిగతా రెండు టీమ్స్అనుమానితుల విచారణ, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించడానికి కష్టపడ్డారు. ఇందులో భాగంగా సుమారు 250 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఎక్కడా బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు ఉన్న వ్యక్తి మహిళల బోగీలో ఎక్కినట్టు కనిపించలేదు.
ప్రమాదవశాత్తు పడిపోయిందా..?
బాధితురాలు చెప్తున్న దాన్ని బట్టి విచారణ జరిపితే ఎక్కడా బలపరిచే ఆధారాలు దొరక్కపోవడంతో ఏం జరిగి ఉంటుందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరిపారు. ప్రమాదవశాత్తు పడిపోయిందా? అని అనుమానించారు. ఎవరైనా మీదకు వస్తున్నప్పుడు దూకినదానికి, ప్రమాదవశాత్తు కింద పడిపోయిన దానికి తేడా ఉంటుంది కాబట్టి.. ఆమె పడిపోయిన చోటును, బాధితురాలు చెప్తున్న బోగీని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు బాధితురాలు ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటుందన్న అంశం వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే, దీనిని కూడా టెక్నికల్‌గా నిరూపించే అవకాశాలు లేకపోవడంతో బయటకు చెప్పడం లేదని తెలుస్తున్నది.