ఈషా ఫౌండేషన్ స్కూల్స్​లో వేధింపులు

ఈషా ఫౌండేషన్ స్కూల్స్​లో వేధింపులు
  •     అక్కడ నా కొడుకును మూడేండ్లు వేధించారు
  •     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరిపించాలి 
  •     ఈషా ఫౌండేషన్ స్కూల్ మాజీ టీచర్​ రాగిణి

బషీర్ బాగ్, వెలుగు :  ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి ఈషా ఫౌండేషన్ స్కూల్​  కేంద్రంగా నిలుస్తోందని ఆ పాఠశాల మాజీ టీచర్​ రాగిణి, ఆమె భర్త సత్యనరేంద్ర ఆరోపించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ఈషా ఫౌండేషన్​ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ స్కూల్స్, ఈషా విద్య, సంస్కృతి, ఈషా హోమ్ స్కూళ్లలో 8వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారన్నారు. బాలికలపై జరిగే నేరాలకు ఈషా ఫౌండేషన్, ఈషా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, ట్రస్టీలు.. ముఖ్యంగా వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్(సద్గురు) బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. 

విద్యా కార్యక్రమాల పేరుతో బాలికలను అర్ధనగ్నంగా ఆధ్యాత్మిక దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. స్కూల్​లో ఎనిమిదేండ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగినా బయటకు రాకుండా మేనేజ్​చేశారని చెప్పారు. 13 ఏండ్ల తన కొడుకుని మూడేండ్ల పాటు వేధించారని, ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు. ఈషా హోమ్ స్కూల్ విద్యార్థులపై జరుగుతున్న అకృత్యాలపై సద్గురు ఎప్పుడూ నోరు విప్పలేదన్నారు. ఈ ఏడాది జూన్ 21న 12వ తరగతి చదువుతున్న 16 ఏండ్ల బాలుడి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్నారు. ఈషా ఫౌండేషన్ దురాగతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.