వాషింగ్టన్ : స్టూడెంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలతో గత రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు మహిళా టీచర్లను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా సగటున 15 నుంచి 16 ఏళ్ల వయసున్న స్టూడెంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిని సీరియస్గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు నిర్వహించి.. వరుస అరెస్టులు చేశారు. డ్యాన్ విల్లే పట్టణంలోని వుడ్ లాన్ ఎలిమెంట్రీ స్కూల్ కు చెందిన ఒక ఉపాధ్యాయిని ముగ్గురు స్టూడెంట్స్పై లైంగిక వేధింపులకు పాల్పడిందని పోలీసులకు కంప్లైంట్స్ వచ్చాయి.
ఇదే విధమైన అభియోగాలతో అర్కాన్సస్ సిటీ, ఒక్లహోమా సిటీ, లింకన్ కౌంటీ, డెస్ మోయిన్స్సిటీ, జార్జియాలకు చెందిన మరో ఐదుగురు మహిళా టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. పెన్సిల్వేనియాలో జావెలిన్కోచింగ్ ఇచ్చే ఒక మహిళా అథ్లెట్ (26)తో పాటు వర్జీనియాలో దివ్యాంగ విద్యార్థులకు పాఠాలు చెప్పే మరో టీచర్ కూడా అరెస్టయిన జాబితాలో ఉన్నారని అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆరుగురు మహిళా టీచర్ల అరెస్టును మాత్రమే పోలీసులు ధ్రువీకరించారు.
త్వరలో వీరిపై కోర్టుల ద్వారా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి మహిళా టీచర్ల అరెస్టుతో అమెరికాలో కలకలం రేగింది. ఈ పరిణామం వెలుగులోకి రావడంతో పేరెంట్స్ ఆందోళనకు లోనయ్యారు.