హసన్‌పర్తి, వెలుగు : తమకు హాస్టల్ కేటాయించాలంటూ కేయూ ఎస్‌ఎఫ్‌సీ స్టూడెంట్లు మంగళవారం యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌సీ స్టూడెంట్లకు ఈ సంవత్సరం హాస్టల్ కేటాయించకపోవడంతో సీనియర్ల రూమ్స్‌లో ఉంటుండగా, మంగళవారం వారిని బయటకు పంపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వీసీ, రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని, రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కేయూ ఎస్సై రాజ్‌కుమార్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
దీంతో పోలీసులు గో బ్యాక్ అంటూ స్టూడెంట్లు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. సాయత్రం 5.30 గంటలకు ప్రారంభమైన ధర్నా రాత్రి వరకు కొనసాగింది. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి స్టూడెంట్లకు మద్దతు ప్రకటించారు. రాత్రి వరకు యూనివర్సిటీ ఆఫీసర్లు ఎవరూ స్పందించకపోవడంతో స్టూడెంట్లు రోడ్డుపైనే కూర్చొని భోజనాలు చేశారు.