బోధన్,వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని ఎస్‌ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ డిమాండ్ చేశారు. బుధవారం బోధన్‌లో ఎస్ఎఫ్ఐ ఆఫీసులో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పై లేదన్నారు. ట్రిపుల్ఐటీ విద్యార్థులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో ఏటా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలన మొదలై మూడు నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం శోచనీయమన్నారు.
బోధన్‌లో జవహర్ నవోదయ విద్యాలయాన్ని, ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు ప్రశాంత్, రాజేశ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.