ఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం : నితీశ్‌‌ నారాయణ్

ఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం : నితీశ్‌‌ నారాయణ్
  • 17 అంశాలపై తీర్మానాలు, రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

ఖమ్మం కార్పొరేషన్‌‌, వెలుగు : ఎస్‌‌ఎఫ్‌‌ఐ ఓ యూనివర్సిటీ వంటిదని, ఎలా జీవించాలో ఇది నేర్పుతుందని, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం పునాదులపై ఇది నిర్మితమైందని ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నితీశ్‌‌ నారాయణ్‌‌ చెప్పారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజున జరిగిన మీటింగ్‌‌కు నితీశ్‌‌ నారాయణ్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతోందని, సెక్యులరిజంపై మాట్లాడినందుకు స్కాలర్స్‌‌ను యూనివర్సిటీల నుంచి బహిష్కరిస్తోందని ఆరోపించారు. విద్యార్థి సమస్యలపై ప్రశ్నించినందుకు దేశ ద్రోహం కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం దిశగా విద్యార్థుల దృక్పథం ఉండేలా ఎస్ఎఫ్ఐ కృషి చేస్తోందన్నారు. కేవీపీఎస్‌‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌‌ బాబు మాట్లాడుతూ విద్యారంగాన్ని కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొచ్చిందని, ఇందుకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో జ్యోతిష్యం, మూఢ విశ్వాసాలను పెట్టి పాఠ్య పుస్తకాలను మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కోయ చంద్రమోహన్, ఐద్వా ట్రెజరర్‌‌ మాచర్ల భారతి, పిట్టల రవి, కల్లూరు మల్లేశ్‌‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం 17 తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. 

61 మందితో నూతన కమిటీ

ఎస్‌‌ఎఫ్‌‌ఐ ఐదో మహాసభల సందర్భంగా 61 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌‌కు చెందిన రజనీకాంత్‌‌, కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన టి. నాగరాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏడుగురు, సహాయకార్యదర్శులుగా ఆరుగురు ఎన్నికయ్యారు. అలాగే 15 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గాన్ని సైతం ఏర్పాటు చేశారు.