హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర ఉద్రిక్తత నెలొకొంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో కు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ప్రీమియర్ షోకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు.
ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వ్యాన్ లో ఎక్కించి అబిడ్స్ పీఎస్ కు తరలించారు పోలీసులు.
డిసెంబర్ 4న రాత్రి సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో కలిసి వచ్చిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. అల్లు అర్జున్ రాకతో ఫ్యాన్స్ థియేటర్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి మృతి చెందగా..ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 48గంటలు గడిస్తే కానీ బాలుడి పరిస్థితి ఏంటనేది చెప్పలేమన్నారు డాక్టర్లు.
మరో వైపు మహిళ మృతిపై అల్లు అర్జున్ టీం స్పందించింది. ఘటన దురదృష్టకరమని.. బాలుడు చికిత్స పొందుతున్నాడు..అవసరమైన సహాయాన్ని అందిస్తాం ఆస్పత్రికి తమ టీం వెళ్తుందని తెలిపింది,