
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి 27వరకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం సిటీలో నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి. నాగరాజు తెలిపారు. సోమవారం చిక్కడపల్లిలోని ఆ సంఘం స్టేట్ ఆఫీసులో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎస్ఎఫ్ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రజనీకాంత్, డి.కిరణ్, రమేశ్ తదితరులతో కలిసి రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలో పది లక్షల మెంబర్ షిప్ తో పెద్ద విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ కొనసాగుతున్నదని చెప్పారు. విద్యారంగంలోని సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడుతున్నట్టు చెప్పారు. ఖమ్మంలో జరిగే రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ పరిరక్షణకు, సర్కారు విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు కోసం కార్యాచరణ తీసుకోనున్నట్టు తెలిపారు. విద్యారంగాన్ని ఆగం చేసేలా కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపైనా చర్చిస్తామన్నారు. మహాసభల చివరి రోజు కొత్త రాష్ట్ర కమిటీని ఎన్నుకుంటామని వెల్లడించారు.