రోడ్డు డివైడర్లు.. సెంట్రల్​ లైటింగే అభివృద్ధా? : షబ్బీర్​అలీ

నిజామాబాద్, వెలుగు: రోడ్డు మధ్యలో డివైడర్​నిర్మించి, సెంట్రల్​ లైటింగ్​ఏర్పాటు చేయగానే అభివృద్ధి జరిగినట్లవుతుందా అని అర్బన్ కాంగ్రెస్​ అభ్యర్థి షబ్బీర్​అలీ ప్రశ్నించారు. ఇండ్లు లేక పేద కుటుంబాలు అవస్థలు పడుతుండగా సీఎం కేసీఆర్​ మాత్రం 150 గదులతో ప్రగతి భవన్​ నిర్మించుకున్నాడన్నారు. తెలంగాణ సాధించిందే కేసీఆర్ ​కుటుంబం కోసం అన్నట్లు బీఆర్ఎస్​ లీడర్లు ప్రవర్తిస్తున్నారన్నారు. సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్​మీటింగ్​లో మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్​ గురించి గొప్పగా ఉపన్యాసాలిచ్చే ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి కేసీఆర్​ను ఒప్పించి సిటీలో మహిళా డిగ్రీ కాలేజీ ఎందుకు తేలేదన్నారు.  తాను గెలిస్తే అభివృద్ధి ఏమిటో చూయిస్తానన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంంటీలతో పేదలు ఇండ్లు నిర్మించుకోడానికి రూ.5 లక్షలు అందిస్తామన్నారు. గంజ్​లోని గుమస్తా, హమాలీ సంఘ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలోనూ షబ్బీర్​పాల్గొని మాట్లాడారు. వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేసి పింఛన్​ సౌకర్యం కల్పించేలా కృషి చేస్తానన్నారు.