మోదీ రాష్ట్రంలో ముస్లింలు ఓబీసీలే.. ఇక్కడ వద్దంటున్న కిషన్​రెడ్డి, సంజయ్ అక్కడ కూడా తొలగించాలి: షబ్బీర్ అలీ

మోదీ రాష్ట్రంలో ముస్లింలు ఓబీసీలే.. ఇక్కడ వద్దంటున్న కిషన్​రెడ్డి, సంజయ్ అక్కడ కూడా తొలగించాలి: షబ్బీర్ అలీ
  • ఇక్కడ వద్దంటున్న కిషన్​రెడ్డి, సంజయ్ అక్కడ కూడా తొలగించాలి: షబ్బీర్ అలీ
  • కేంద్ర మంత్రుల హోదాలో అలాంటి వ్యాఖ్యలు సరికాదు   
  • బీసీలపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో తప్ప మరే ఇతర రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో ముస్లింలు లేరన్నట్టు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ రాష్ట్రమైన గుజరాత్​లో ముస్లింలు ఓబీసీ జాబితాలోనే ఉన్నారని, ముందు వారిని ఆ జాబితా నుంచి తొలగించాలని సవాల్ విసిరారు.

మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం ద్వారా మిగతా బీసీలకు అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులుగా ఉండి అలా ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. సాధారణ వ్యక్తులు, చదువుకోని వారు అలా మాట్లాడితే వదిలేయవచ్చని.. కానీ, కేంద్ర మంత్రుల హోదాలో కిషన్ రెడ్డి, సంజయ్ అలా మాట్లాడడం మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా? అని నిలదీశారు. 

బీసీల మీద కిషన్ రెడ్డి,  సంజయ్ కి అంత ప్రేమ ఉంటే, దేశ వ్యాప్తంగా కుల గణన చేయించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే అప్పుడు బండి సంజయ్ ని తాను అభినందిస్తానని స్పష్టం చేశారు. 1882లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ ను వేసిందని.. 1918లో మిల్లర్ కమిషన్ దాన్ని స్టడీ చేసిందని.. 1953 లో కాలేకర్ రిపోర్టులో కూడా కొన్ని కులాలను బీసీ జాబితాలో చేర్చారని, ఇప్పటికీ వెనుకబడిన మైనార్టీలు బీసీల జాబితాలోనే ఉన్నారని షబ్బీర్​అలీ పేర్కొన్నారు.

ఓబీసీ జాబితాలో ముస్లింలున్న అంశంపై సుప్రీంకోర్టు కూడా స్పష్టత ఇచ్చిందని, దీనికి సంబంధించిన రిపోర్టులతో పాటు అప్పటి కమిషన్ల నివేదికను కిషన్ రెడ్డి, సంజయ్ కి పోస్టు ద్వారా పంపిస్తున్నానని చెప్పారు. వాటిపై సంతృప్తి చెందకపోతే వారు  పిలిస్తే.. బీజేపీ కార్యాలయానికి వెళ్లి ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. మతంలో కూడా పేదరికం లేదా అని ప్రశ్నించారు. వెనకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా.. వారు ఆర్థికంగా వెనకబడిన వారేనని స్పష్టం చేశారు.