నిజామాబాద్ అర్బన్ ​నుంచి షబ్బీర్​ అలీ పోటీ ?

  • అనూహ్యంగా తెరపైకి..
  • ఆకుల లలితను నియంత్రించడానికి ఎత్తుగడ

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ ​అర్బన్​ నుంచి కాంగ్రెస్​అభ్యర్థిగా మాజీ మంత్రి షబ్బీర్​అలీ పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న ఈ సెగ్మెంట్ ​నుంచి ఆయన్ను బరిలో దింపాలని హైకమాండ్​ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ ​పోటీ చేస్తున్నందున సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత అర్బన్​టికెట్ కోసం పైరవీలు చేస్తున్న నేపథ్యంలో ఆమెను నియంత్రించడానికే జిల్లా ముఖ్య నేతలు ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారన్న చర్చ కూడా సాగుతోంది.

ట్విస్టుల మీద ట్విస్టులు..

ఉమ్మడి జిల్లాలోని మూడు సెగ్మెంట్లకు మాత్రమే కాంగ్రెస్​ ఫస్ట్​లిస్ట్​లో క్యాండిడేట్లను ప్రకటించింది. కామారెడ్డి నుంచి షబ్బీర్​అలీ పేరు ఉంటుందని అంతా భావించారు. కానీ ఆయనకు టికెట్​ కన్ఫమ్​కాకపోవడం పార్టీలో చర్చకు దారి తీసింది. ఆయన కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అక్కడ సుభాష్​రెడ్డి, మదన్​మోహన్​మధ్య పంచాది తేలక పార్టీ స్టేట్​లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డిలో షబ్బీర్​కు చాన్స్​ఇస్తే వారిద్దరి నుంచి సమస్య వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

దీంతో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న అర్బన్​నుంచి షబ్బీర్​ను బరిలో దింపాలని జిల్లాకు చెందిన సీనియర్​ నేత ప్రతిపాదించగా, హైకమాండ్​ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అర్బన్​ నుంచి 12 మంది లీడర్లు టికెట్​ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. బీసీ వర్గానికి చెందిన అభ్యర్థినే ఇక్కడ పోటీ చేయించాలన్న డిమాండ్​ను లీడర్లు మొదటి నుంచి వినిపించారు. దరఖాస్తుల వడబోత అనంతరం టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్, మాజీ మేయర్ ​సంజయ్​పేర్లను అధిష్టానం ఢిల్లీకి పంపింది. అయితే ఫస్ట్​లిస్ట్ ​క్యాండిడేట్ల ప్రకటనకు ముందు అర్బన్​లో మైనార్టీ నేతకు ఛాన్స్​ఇవ్వాలనే ప్రపోజల్​ వచ్చింది.

2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తాహెర్​బిన్​హందాన్ ​పేరును హైకమాండ్​ పరిశీలించింది. ఇంతలో బీఆర్ఎస్​అర్బన్​ టికెట్​ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్​అర్బన్ ​టికెట్​భరోసాతో ఆమె బీఆర్ఎస్​వీడారనే బలమైన ప్రచారం జిల్లా హస్తం లీడర్లలో ఉంది. స్థానిక క్యాడర్​ఆమోదం లేకుండా ఆకుల లలిత ఢిల్లీ స్థాయిలో పావులు కదపడం వారికి నచ్చడం లేదు.

వ్యూహంలో భాగమే..

మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డితో పాటు  మరికొందరు కాంగ్రెస్ ​లీడర్లు ఇటీవల ప్రెస్​మీట్ ​నిర్వహించి ఆకుల లలితను జిల్లా కాంగ్రెస్ ​లీడర్లేవరూ ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన మహిళా లీడర్​గా ఆకుల లలితకు గుర్తింపు ఉంది. ఆమెను నియంత్రించడంతో పాటు ఆశావహుల సర్దుబాటుకు ఇబ్బందిగా ఉన్న ఈ సెగ్మెంట్​నుంచి షబ్బీర్​అలీని పోటీ చేయించాలని జిల్లా ముఖ్యనేత ఒకొరు స్టేట్ ​లీడర్లకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వివిధ దశలు దాటి రాహుల్​గాంధీ దాకా వెళ్లినట్లు తెలుస్తోంది.  

ALSO READ : వందేండ్ల కరువును దూరం చేశాం : మంత్రి నిరంజన్​రెడ్డి

రూరల్​లో టెన్షన్​..

నిజామాబాద్​ రూరల్​ సెగ్మెంట్​లోనూ ఆశావహుల మధ్య టికెట్​ టెన్షన్ ​పెరిగింది. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్ ​నగేశ్​రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తోంది. మాజీ మంత్రి మండవను బరిలో దింపనున్నారనే ప్రచారంతో వీరు హైరానా పడుతున్నారు. ఈ విషయమై భూపతిరెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డికి రాసిన లెటర్​ సోషల్ ​మీడియాలో వైరలవుతోంది. పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు.