కామారెడ్డి: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయిందని ఆయన ఆరోపించారు. మే 13న రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ కార్యకర్తలు.. పువ్వు గుర్తుకు ఓటెయ్యమని చెప్పడం దీనికి నిదర్శనమన్నారు. మే 14వ తేదీ మంగళవారం జిల్లా కేంద్రంలో సబ్బీర్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ 11 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ గెల్చుకుందని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పారు షబ్బీర్ అలీ. కేసీఆర్ తన కూతురు కవితను జైలు నుంచి బెయిల్ పై బయటకు తీసుకురావడానికి బీజేపీతో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నాడని విమర్శించారు. నిన్నటి వరకు దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రధానమంత్రి అవుతారని చెప్పిన కేసీఆర్.. బీఆర్ఎస్ ను బీజేపీ పార్టీకి అమ్మిన ఘనత ఆయన దక్కుతుందన్నారు. కేసీఆర్.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అన్నారు. 5 నెలలలో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు. మతతత్వ పార్టీతో కలిసిన బీఆర్ఎస్ కు సెక్యులరిజం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన మండిపడ్డారు.