- అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా?
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఆస్తులు అమాంతం పెరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా అని కాంగ్రెస్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కేటీఆర్ అవినీతిపై తాను ఓపెన్ చాలెంజ్ చేస్తున్నానని, ఆధారాలతో సహా అన్ని నిరూపించడానికి తాను సిద్ధమన్నారు.
శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. 2009 ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ తన ఆస్తిని రూ.4.32 కోట్లుగా చూపారని, 2014లో రూ.7 కోట్లుగా చూపారని తెలిపారు. ఉద్యమం చేస్తే ఆస్తులు ఎలా సంపాదించుకుంటారని ప్రశ్నించారు.
గ్రేటర్ పరిధిలో నిర్మిస్తున్న హైరైజ్ బిల్డింగ్ లలో కేటీఆర్ కు 30 శాతం వాటాలు ఉన్నాయని, ఆధారాలతో బయటపెడతానని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగదని, చట్టాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం గాంధీ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అజ్మీర్ దర్గాకు మహేశ్ గౌడ్ చాదర్ ను సమర్పించారు.