కరెంట్​ ఉత్పత్తి పెంచుతాం

కరెంట్​ ఉత్పత్తి పెంచుతాం
  • ప్రభుత్వ​ సలహాదారుడు షబ్బీర్​అలీ

నిజామాబాద్, వెలుగు: వైఎస్​రాజశేఖర్​రెడ్డి ప్రభుత్వంలో తాను విద్యుత్​ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సారెస్పీలో తొమ్మిది మెగావాట్ల కరెంట్​ఉత్పత్తిచేసే నాలుగు టర్బయిన్​లు ఏర్పాటు చేయించానని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​అలీ తెలిపారు. గత పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో వాటి కెపాసిటీ పెంచే ఆలోచన చేయలేదని విమర్శించారు. మంగళవారం అదిలాబాద్​లో ప్రజాపాలన కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఎస్పారెస్పీని సందర్శించి ఇంజినీర్లతో మాట్లాడారు.

కరెంటు ఉత్పత్తి పెంచడానికి కెనాల్​విస్తీర్ణం పెంచాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తప్పక చేయిస్తామన్నారు. జిల్లాలోని కాళేశ్వరం 20, 21, 22 ప్యాకేజీలను మంత్రి ఉత్తమ్​ త్వరలో విజిట్​ చేయనున్నారని తెలిపారు. 

ఒక్కమంచి పని చేయలే..

ఎన్నికలలో కోలుకోలేని దెబ్బతిన్న బీఆర్​ఎస్​ పార్టీ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రం విడిపోయి పదేండ్లు అవుతోందని అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్న  తెలుగు ప్రజల మధ్య ఆంధ్ర, తెలంగాణ పేరుతో విషం చిమ్మే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారని, అర్హులైన ప్రతీ రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. రైతు భరోసా కూడా త్వరలో అందించబోతున్నామన్నారు.