కేసీఆర్​ను రెండు చోట్ల ఓడిస్తం : షబ్బీర్ అలీ

  • కేసీఆర్​ను రెండు చోట్ల ఓడిస్తం 
  • కేసీఆర్..గజ్వేల్​లో చేసిందేం లేదు,
  • రేపు కామారెడ్డిలో చేసేదేమీ లేదు: మాజీ మంత్రి షబ్బీర్​ అలీ
  • కామారెడ్డి నుంచి కార్యకర్తలతో వచ్చి గజ్వేల్​లో పర్యటన

గజ్వేల్, వెలుగు : ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర నిరుపేదలకు గతంలో ఇందిరమ్మ ఇచ్చిన భూములను సీఎం కేసీఆర్ అన్యాయంగా గుంజుకున్నరని, తాము అధికారంలోకి రాగానే వీటన్నింటిని తిరిగి పేదలకు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి నుంచి పెద్ద సంఖ్యలో అనుచరులతో కలసి సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు తరలివచ్చారు. ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ తూంకుటం నర్సారెడ్డితో కలసి నియోజకవర్గంలో పర్యటించారు. 

గజ్వేల్ టౌన్​లో నిర్మిస్తున్న బస్​స్టాండ్, అవుటర్ రింగ్​రోడ్డును పరిశీలించారు. తర్వాత వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో 95 రోజులుగా నిర్వాసిత రైతులు చేస్తున్న దీక్షలో కూర్చోని సంఘీభావం తెలిపారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేసీఆర్​ప్రభుత్వం వర్గల్ శివారులో 1200 ఎకరాల భూమిని రైతుల నుంచి అన్యాయంగా గుంజుకుందని ఆరోపించారు. ఎంతో విలువైన ఈ భూములను చాలా తక్కువ పరిహారంతో తీసుకుని వారి జీవితాలపై దెబ్బకొట్టారన్నా. కేసీఆర్ గజ్వేల్ లో చేసిన అభివృద్ది ఏమీ లేదన్నారు. 

రేపు కామారెడ్డిలో కూడా చేయబోయేది ఏం లేదన్నారు. సీఎం గజ్వేల్​లో ఏదో చేశానని చెబితే చూద్దామని వచ్చానని, కానీ అలాంటిది ఏమీ కనిపించక పోగా ఇక్కడ రైతులు, భూనిర్వాసితులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని చెప్పారు. గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇక్కడి ప్రజలకు కనిపించని, ఎలాంటి అభివృద్ధి చెయ్యలేని కేసీఆర్ కామరెడ్డిలో పోటీ చేస్తానని చెప్పటం హాస్యాస్పదం అన్నారు. నాచగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తానని చెప్పి ఏండ్లు గడుస్తున్నా కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదన్నారు. హల్దీవాగు సుందరీకరణ పనులు ఐదేండ్లుగా ఎక్కడివక్కడే ఉన్నాయని విమర్శించారు.