కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ తరఫున కామారెడ్డి నుంచే తాను పోటీ చేస్తానని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. తాను నియోజకవర్గం మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తారని చెప్పిన రోజే తాను వెల్కమ్ చెప్పానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని వెల్లడించారు.
అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరని తెలిపారు. కామారెడ్డిలోనే పుట్టానని, అక్కడే మరణిస్తానని ఇదివరకే చెప్పినట్లు గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ గజ్వేల్‌ను వదిలి కామారెడ్డికి వస్తున్నారని విమర్శించారు. కామారెడ్డిలో ఉండనని గజ్వేల్ ప్రజలే తనకు సమస్తం అని ఇటీవల కేసీఆర్ మట్లాడారని తెలిపారు. ఈ కామెంట్‌పై కామారెడ్డి ప్రజలకు కేసీఆర్ వివరణ ఇవ్వాలని షబ్బీర్‌అలీ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.