భూ సేకరణకు ఫండ్స్​ ఇవ్వాలి : షబ్బీర్​ అలీ

భూ సేకరణకు ఫండ్స్​ ఇవ్వాలి :  షబ్బీర్​ అలీ
  • ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​ అలీ

నిజామాబాద్​/కామారెడ్డి​, వెలుగు : ప్రాణహిత– చేవెళ్ల  కింద చేపట్టిన ప్యాకేజీ 22 పనులు చేపట్టాలని, భూ సేకరణకు ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాజెక్టులపై హైదరాబాద్​లోని జలసౌధలో ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి  రివ్యూ నిర్వహించగా షబ్బీర్ అలీ మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్యాకేజీ 21, 22 పనులు పూర్తి చేయడంతోపాటు రిజర్వాయర్​ నిర్మాణం చేపట్టాలన్నారు.

ప్యాకేజీ 20లో భాగంగా నిజాంసాగర్​ ఏకీకృత కెనాల్​లో వాటర్​ లీకేజీ అరికట్టేందుకు కంక్రీట్ గోడ నిర్మించాలని తీర్మానించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్​కు చేరువలోని 12 ఎకరాల ల్యాండ్​లో ఎకో టూరిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మునిపల్లి లిఫ్ట్​ స్కీమ్ బకాయిలు రిలీజ్​ చేయడంతో పాటు ఆర్మూర్​ సెగ్మెంట్​లోని నాలుగు మైనర్​ లిఫ్ట్​లను పునరుద్ధరిస్తామన్నారు. సిద్దాపూర్​ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయడమేకాకుండా చౌట్​పల్లి లిఫ్ట్​ స్కీం పైప్ లైన్​ లీకేజీలు ఆపడానికి  రిపేర్లు చేయించాలని నిర్ణయించామన్నారు.

 నాగమడుగు రిజర్వాయర్​తో భూములు ముంపునకు గురికాకుండా కాపాడతామని, వరద నీటితో దెబ్బతిన్న సింగీతం ప్రాజెక్టు కెనాల్స్​ బాగు చేయించి, కౌలాస్​నాలా ఆధునీకరణ సాధ్యసాధ్యాలు ఇంజినీర్లతో స్టడీ చేయించి నివేదికలు  తెప్పించుకుంటామన్నారు.  రివ్యూలో  జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్ ఎంపీ సురేష్​ షెట్కర్​, పీసీసీ ప్రెసిడెంగ్​మహేశ్​కుమార్​ గౌడ్​, రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

పాత డిజైన్​తో మంచిప్ప రిజర్వాయర్ నిర్మించాలి..

ప్రాణహిత 21 ప్యాకేజీ కింద మంచిప్ప వద్ద రైతులకు నష్టం కలుగకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం రూపొందించిన పాత డిజైన్​లో నిర్మాణ పనులు చేపట్టాలని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంత్రి ఉత్తమ్​ను కోరారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం తయారు చేసిన రీడిజైన్​తో నష్టం కలుగుతుందని దానిని పక్కనపెట్టాలన్నారు. ప్యాకేజీ కింద 1.82 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా గతంలో కాంగ్రెస్ సర్కారు రూపొందించిన ప్లాన్​ ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరారు.