హైదరాబాద్: జన్వాడలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ ఘటనపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. సోమవారం (అక్టోబర్ 28) ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మీ బామ్మర్ది ఫామ్ హౌస్‌లో దొరికిన డ్రగ్స్, లిక్కర్, అమ్మాయిలు, అబ్బాయిల వివరాలు అన్ని బయటపెట్టు.. అడ్డంగా దొరికి కూడా బుకాయించడానికి సిగ్గు, శరం ఉందా కేటీఆర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ముందుగా కేటీఆర్ నార్కో టెస్ట్ చేయించుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
ప్రతి వారం కేటీఆర్ బామ్మర్ది రేవ్ పార్టీ పెడుతున్నారని పోలీసులకు సమాచారం ఉందని.. పక్కా ఇన్ఫర్మేషన్తోనే పోలీసులు దాడి చేశారని తెలిపారు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్‌కు నాకు సంబంధం లేదు అన్నావ్.. హైడ్రా ఎపిసోడ్‌తో నా దోస్త్ ఫామ్ హౌస్ అన్నావ్.. ఇప్పుడేమో మా బామ్మర్ది ఇల్లు అంటున్నావ్.. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలేనని విమర్శించారు. పార్టీలో లీటర్ లిక్కర్, 6 బీర్లు మాత్రమే ఉండాలని ఎక్సైజ్ నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ పార్టీలో పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది.
చట్టం తెలిసిన వ్యక్తులే తప్పులు చేస్తే పోలీసులు కేసులు పెట్టక పోతే ఏం చేస్తారని నిలదీశారు. జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై త్వరలో వాస్తవాలు అన్ని ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్‌పై డ్రోన్ ఎగరేసి వాస్తవాలు బయటపెట్టినందుకు చిన్ని పిట్టి కేసులో ఆ రోజు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం 40 రోజులు జైల్లో పెట్టింది. అండర్ ట్రయల్ ముద్దాయిగా జైల్లో పెట్టి రేవంత్ రెడ్డిని చంపాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALSO READ : ఫాంహౌస్ పార్టీపై.. కేటీఆర్ బామ్మర్ధి రాజ్ పాకాలకు నోటీసులు
ఆనాడు జైల్లో రేవంత్ రెడ్డి హత్యకు కుట్ర చేస్తే.. ప్రజల అతడిని ముఖ్యమంత్రిని చేశారన్నారు. కేటీఆర్ హవాయి చెప్పల్ నుండి హవాయి జహజ్ వరకు ఎదిగారు. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుండి వచ్చాయో ఆయన ఆస్తులపై ప్రభుత్వం విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు విచారణలు అన్ని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగాయి.. కేసీఆర్ ఏమైనా జడ్జా అని ప్రశ్నించారు.