సంకెళ్లు.. సహజంగా దొంగలకు వేస్తారు.. మన తిరుమలగిరి పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్ గేట్లకు వేశారు. అవును.. గేట్లకు గడియ లేకపోవటంతో బేడీలతో తాళాలు వేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.
2024, నవంబర్ 4వ తేదీ ఉదయం.. మాజీ సర్పంచ్ ల అరెస్ట్ కు నిరసనగా మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. వీరిని స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు.. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పీఎస్ లోపలికి రాకుండా.. పోలీస్ స్టేషన్ గేట్లకు సంకెళ్లతో తాళాలు వేశారు పోలీసులు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ నవంబర్ 4న ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు మాజీ సర్పంచ్ లు. అయితే హైదరాబాద్ కు వెళ్లకుండా మాజీ సర్పంచ్ లను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు . జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు.
దీంతో మాజీ సర్పంచులకు మద్దతుగా తిరుమలగిరి పీఎస్ ముందు రోడ్డుపైన హరీశ్ రావుతో పాటు మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ తోపాటు పలువురు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పీఎస్ లోపలికి రాకుండా తాళానికి బదులుగా ఇలా బేడీలు వేశారు.